దిగజారి మాట్లాడటం సరికాదని ముఖ్యమంత్రిపై ధ్వజమెత్తిన గురాన అయ్యలు

విజయనగరం, ఒక రాష్ట్రానికి ముఖ్య‌మంత్రిగా బాధ్య‌తాయుత‌మైన స్థానంలో ఉన్న జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వ్య‌క్తిగ‌తంగా అత్యంత నీచ‌మైన స్థాయికి దిగజారి మాట్లాడటం సరికాదని జనసేన నేత గురాన అయ్యలు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పై జగన్‌ వ్యాఖ్యలు ఆయన అసహనానికి నిదర్శనమన్నారు. తెలంగాణ ఎన్నికల్లో జనసేన పార్టీకి బర్రెలక్క కంటే తక్కువ ఓట్లు వచ్చాయంటూ సీఎం జగన్ వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేటు అన్నారు. 2014లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి నోటా కంటే 56 స్థానాల్లో తక్కువ ఓట్లు వచ్చాయని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలు రాళ్లతో కొట్టిన తీరు మర్చిపోయావా అంటూ జగన్‌ను ప్రశ్నించారు. ఇండిపెండెంట్‌గా నిలబడి పోటీ చేసే దమ్ము బర్రెలక్కకైనా ఉంది కానీ తెలంగాణలో పోటీ చేసే దమ్ము జగన్‌కు, వైసీపీకి లేదన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో గత ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థులతోనే 2024 ఎన్నికలకు వచ్చే సత్తా ఉందా అని జగన్ కి సవాల్ చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని ఉద్ధానం పరిసర ప్రాంతాల్లో కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వారి కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత కొన్ని సంవత్సరాలుగా ఉద్యమిస్తున్నారన్నారు. పవన్ కళ్యాణ్ వల్లనే ఉద్ధానం కిడ్నీ సమస్య పరిష్కారానికి కదలిక వచ్చిందన్నారు. సమయం, సందర్భం లేకుండా నోటికి వచ్చిన్నట్లు ప్రతిపక్ష నేతలను కించపరుస్తూ మాట్లాడే ఇటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఉండటం చాలా దురదృష్టకరమన్నారు. ప్రభుత్వ సొమ్ముతో అధికారికంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలకు నాలుగు మంచి మాటలు చెబితే బాగుండేదన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు.