తెలుగు రాష్ట్రాల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన జనసేనాని

నూతన సంవత్సర శుభాకాంక్షలు
తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా విలసిల్లాలి

నూతనం.. ప్రారంభం.. ఆరంభం.. కొత్త అనే పదాలలోనే ఒక ఉత్తేజం నిబిడీకృతమై ఉంటుంది. అటువంటిది మరి కొత్త సంవత్సరం అంటే..? ఎన్నో ఆశలు, ఎన్నో ఆశయాలు, మరెన్నో ఆకాంక్షలు… లక్ష్యాలతో సంగమమై మన ముందుకు తరలివస్తుంది. అలా మన ముందు ఆవిష్కృతమవుతున్న 2022 నవ వసంతానికి ఆహ్వానం పలుకుతూ
తెలుగువారందరితో పాటు భారతీయులందరికీ నా తరఫున, జనసేన పార్టీ తరపున ప్రేమపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నాను.
గడచిన రెండేళ్లలో కరోనా మహమ్మారి మానవాళిపై పైచేయి సాధించాలని చేసిన ప్రయత్నాలను మనమందరం అనుభవైక్యంగా చవిచూశాము. అయితే మానవాళి మనోనిబ్బరం, మనోవిజ్ఞానం ముందు కరోనా పలాయనం దిశగా
ప్రయాణించడం లోకకళ్యాణంగా భావిస్తున్నాను. ఆరపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్లు కరోనా వెళ్లిపోయే ముందు కూడా తన ప్రభావాన్ని చూపాలని ప్రయత్నిస్తూనే ఉంది. అయితే ఇప్పటి వరకూ పాటించిన జాగురూకతతోనే మనం ముందుకు సాగాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజలందరూ ఆరోగ్యకరం, ఆనందమైన జీవితం గడపాలని
కోరుకుంటున్నాను. కరోనాతోపాటు అతివృష్టి రూపంలో ప్రకృతి కూడా కొంత ప్రకోపాన్ని ప్రదర్శించినా ప్రజల జీవన ప్రస్థానం అప్రతిహతంగా సాగిపోవడం సంతోషకరమైన పరిణామం. ఈ వైపరీత్యాలతోపాటు కొందరు పాలకుల చిత్తచాపల్యం వల్ల కూడా కొన్ని ప్రాంతాలలో ప్రజలు బాధలుపడ్డారు.
పడుతూనే వున్నారు. ఈ నూతన సంవత్సరంలో తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా విలసిల్లాలని, ఎటువంటి ఈతిబాధలు లేకుండా ప్రజలకు సుఖసంతోషాలు ప్రసాదించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ అన్నారు.