విశాఖ షిప్‌యార్డ్ లో భారీ క్రేన్ కూలిన దుర్ఘటన

విశాఖలో మరో విషాదo, హిందుస్థాన్‌ షిప్‌యార్డులో శనివారం భారీ క్రేన్ కూలి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనకు మానవ నిర్లక్ష్యమే కారణమన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దేశంలోని తొలి నౌకానిర్మాణ కేంద్రం ‘హిందుస్థాన్‌ షిప్‌యార్డులో బిల్డింగ్‌ డాక్‌కి, స్లిప్‌వే బెర్త్‌కి మధ్యలో ట్రాక్‌పై ప్రమాదం చోటుచేసుకుంది. ఇక, అనుపమ్‌ సంస్థ తయారుచేసిన క్రేన్‌లో లోపాలు ఉన్నట్లు షిప్‌యార్డ్‌ అధికారులు గతంలోనే గుర్తించారు. దీంతో దాని పనితీరును క్షేత్రస్థాయిలో చూపించి క్రేన్‌ను అప్పగించాలని కోరుతూ పలుసార్లు లేఖలు రాశారు. కానీ దీనిని ఆ సంస్థ పట్టించుకోలేదు.

2017 ఆగస్టులో క్రేన్‌ షిప్‌యార్డ్‌కు చేరుకున్నా లోపాల కారణంగా దానిని పక్కనబెట్టారు. దాదాపు మూడేళ్లు కావస్తున్నా ఆ సంస్థ నుంచి ఎలాంటి స్పందనా రాకపోవడంతో ఆ క్రేన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకున్నారు. గ్రీన్‌ఫీల్డ్, లీడ్‌ ఇంజినీర్స్, స్క్వాడ్‌-7 సంస్థల సహకారంతో క్రేన్‌లో గుర్తించిన లోపాలను సరిచేయించారు. షిప్‌యార్డ్‌లోని స్లిప్‌వే జెట్టీ-4లో శనివారం ట్రయల్‌రన్‌ నిర్వహిస్తున్న సమయంలోనే ప్రమాదం జరిగింది. ఈ నేపథ్యంలో సాంకేతిక సమస్యలే ప్రమాదానికి కారణమని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు