హైదరాబాదులో మరోసారి కుండపోత వాన… నీటమునిగిన మూసారాంబాగ్ బ్రిడ్జి

హైదరాబాదు నగరం మరోసారి కుండపోత వానతో అతలాకుతలమైంది. ఈ సాయంత్రం కురిసిన అతి భారీ వర్షానికి నగరం జలమయమైంది. ఈ క్రమంలో మూసీ నదిలోకి వరద నీటిని విడుదల చేయడంతో మూసారాంబాగ్ బ్రిడ్జి నీటమునిగింది. దాంతో అంబర్ పేట-మూసారాంబాగ్ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

గత కొన్నిరోజులుగా మూసీ నదీ పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో మూసీ పరవళ్లు తొక్కుతోంది. ఈ నేపథ్యంలో అధికారులు రెండో నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. చాదర్ ఘాట్, పురానాపూల్, మూసారాంబాగ్, ఓల్డ్ మలక్ పేట్, శంకర్ నగర్ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ హెచ్చరించింది.