ఏనుగుల బాధలు ఇంకెన్నాళ్లు?!

  • ఓవైపు ప్రజల ప్రాణాలు, మరోవైపు ఏనుగులు ప్రాణాలు పోతున్నా లెక్క లేదా?
  • బస్సు పై ఏనుగు చేసిన దాడిలో ఊహించని ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు?
  • తక్షణమే ఏనుగుల తరలింపుకు చర్యలు చేపట్టాలి
  • ఏనుగులు సమస్య పరిష్కారానికి ప్రభుత్వం నిర్ణయం ప్రజలకు చెప్పాలి
  • బాధిత కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలి బకాయి నష్టపరిహారం చెల్లించాలి
  • జిల్లా అటవీ శాఖ కార్యాలయం వద్ద అఖిలపక్ష పార్టీల నాయకుల నిరసన

పార్వతీపురం నియోజకవర్గం: ఏనుగుల బాధలు ఇంకెన్నాళ్లని అఖిలపక్ష పార్టీల నాయకులు ప్రశ్నించారు. మంగళవారం జనసేన పార్టీ నాయకులు వంగల దాలి నాయుడు, అన్నాబత్తుల దుర్గాప్రసాద్, కర్రి మణికంఠ, తామరకండి తేజ, గుంట్రెడ్డి గౌరీ శంకర్, అంబటి బలరాం, తిరుమలరెడ్డి కనకరాజు, సిపిఎం, సిఐటియు, ఐద్వా, పట్టణ పౌరు సంక్షేమ సంఘ నాయకులు వి.ఇందిర, రెడ్డి శ్రీదేవి, గొర్లి వెంకటరమణ, పాకల సన్యాసిరావు, బంకురు సూరిబాబు, సంచాన ఉమామహేశ్వరరావు, అయ్యర్ల సంఘ నాయకులు పి. సంగం, బిజెపి నాయకులు సొండి సంజీవి, పళ్లెం కనకారావు, రొంపిల్లి ప్రభాకర్ తదితరులు ఏనుగుల సమస్యను పరిష్కరించాలని కోరుతూ పార్వతీపురం పట్టణంలోని అటవిశాఖ జిల్లా కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు అటవీశాఖ రేంజ్ అధికారి కె.మణికంఠేష్ తో మాట్లాడుతూ ఓ వైపు ప్రజల ప్రాణాలు, మరోవైపు ఏనుగుల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వానికి లెక్క లేదని అన్నారు. సోమవారం కొమరాడ మండలం అర్తాం గ్రామం వద్ద ఏనుగు బస్సుపై చేసిన దాడిలో జరగకూడని ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ఇప్పటివరకు 11 మంది ప్రజల ప్రాణాలను పొట్టన పెట్టుకొని, 35 మూగ జీవాలను చంపేశాయన్నారు. దాదాపు మూడు కోట్ల ఆస్తి నష్టం జరిగిందన్నారు. గత నాలుగైదు ఏళ్లుగా పార్వతీపురం మన్యం జిల్లాలో కురుపాం, పార్వతీపురం, పాలకొండ తదితర నియోజకవర్గాల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ఏనుగుల సమస్య పరిష్కారానికి ప్రభుత్వ నిర్ణయం ప్రజలకు చెప్పాలన్నారు. గతంలో శత్రు చర్ల విజయరామరాజు అటువిశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఒక ఏనుగును తరలించేందుకు ఆపరేషన్ గజ పేరుతో ఏనుగు సమస్యను పరిష్కరించారన్నారు. కానీ ఇప్పుడు పాలకులకు, అధికారులకు కనీసం చిత్తశుద్ధి లేదన్నారు. ఇంకా ఎన్నాళ్ళు ఎంత మందిని చంపే వరకు చూస్తారన్నారు. తక్షణమే ఏనుగుల తరలింపుకు తదితరులు చేపట్టాలన్నారు. ఏనుగుల భారిన పడి మృత్యువాత పడిన కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. అలాగే బకాయి నష్టపరిహారం చెల్లించాలన్నారు. ఏనుగు ట్రాకర్లకు బకాయి జీతాలు ఇవ్వాలన్నారు. ఏనుగుల కదలికలు మీడియా పత్రికల ద్వారా ప్రజలకు ప్రతిరోజు తెలియజేయాలన్నారు. అలాగే వన్యప్రాణ సంరక్షణ చట్టం ప్రకారం ఏనుగుల ప్రాణాలకు ఎటువంటి హాని లేకుండా చూడాలని వాటికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సందర్భంగా వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అటవీశాఖ రేంజ్ అధికారి కె.మణికంఠష్ మాట్లాడుతూ ఏనుగులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు స్థలం కోసం అన్వేషిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన, బిజెపి, సిపిఎం, సిఐటియు, ఐద్వా పట్టణ పౌరు సంక్షేమ సంఘం తదితర పార్టీలు, ప్రజా సంఘాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. ఏనుగుల సమస్యకు శాశ్వత పరిష్కారం చేపట్టని పక్షంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో పోరాటం ఉదృతం చేస్తామని హెచ్చరించారు.