క్షమాపణలు చెప్పేందుకు నేను సిద్ధం: తలసాని

గంగపుత్రుల పట్ల మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని.. వెంటనే ఆయన్ను మంత్రి పదవి నుంచి సీఎం కేసీఆర్ తొలగించాలని అఖిల భారత గంగపుత్ర సంఘం డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఓ కార్యక్రమంలో మంత్రి చేసిన వ్యాఖ్యలు కులాల మధ్య చిచ్చు పెట్టేలా ఉన్నాయని.. మత్స్య శాఖ మంత్రికి గంగపుత్రుల కులవృత్తి ఏమిటో తెలియనప్పుడు మినిస్టర్‌గా ఉండే హక్కు లేదని గంగపుత్ర సంఘం నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ వివాదంపై తాజాగా మంత్రి తలసాని స్పందిస్తూ కోకాపేటలో జరిగిన ముదిరాజ్ భవన్ శంకుస్థాపన కార్యక్రమంలో గంగపుత్రులను బాధపెట్టేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు” అంటూ తెలంగాణ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్  వీడియో రూపంలో మాట్లాడారు.

‘గంగ పుత్రులు మనోభావాలు కించపరిచేలా నేను తప్పుగా ఏమీ మాట్లాడలేదు. వారి మనోభావాలు దెబ్బ తినేలా మాట్లాడాను అనిపిస్తే క్షమాపణలు చెప్పేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. సీఎం కేసీఆర్ గంగ పుత్రులకు చెరువులు, కుంటలు మీద సర్వాధికారాలు ఇవ్వాలని అసెంబ్లీ వేదికగా చెప్పిన అంశాలను మాత్రమే నేను ప్రస్తావించాను’ అని వీడియో సందేశంలో తలసాని చెప్పుకొచ్చారు. మంత్రి తాజా వ్యాఖ్యలపై గంగపుత్ర సంఘం ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాలి.