నేనెప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదు.. దియా మీర్జా

బాలీవుడ్ డ్రగ్స్ కేసులో రోజుకో కొత్త పేరు వెలుగులోకి వస్తోంది. తాజాగా బాలీవుడ్ నటి దియా మీర్జా పేరు కూడా కొన్ని జాతీయ న్యూస్ చానళ్లు ప్రస్తావిస్తూ కథనాలు ప్రసారం చేస్తున్నాయి. 2019లో దియా డ్రగ్స్ తీసుకున్నట్టుగా గుర్తించినట్టు వార్తలు ప్రసారం చేస్తున్నాయి. ఈ మేరకు స్పందించిన దియా మీర్జా ఈ వార్తలను ఖండించింది.

తాను డ్రగ్స్ తీసుకున్నట్టు వచ్చిన ఆరోపణలను దియా మీర్జా ఖండిస్తూ.. ఇది పూర్తిగా నిరాధారమైన, తప్పుడు ఆరోపణలని ఆమె ట్వీట్ చేసింది. ఈ విధమైన ఆరోపణలు, వార్తలు తన ప్రతిష్టకు, తను కష్టపడి సంపాదించుకున్న తన కెరీర్ కు తీవ్ర భంగం కలిగిస్తాయని ఆమె పేర్కొంది. తనెప్పుడూఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని దియా స్పష్టం చేసింది. గత ఏడాది తాను ఆమెకు డ్రగ్స్ అరెంజ్ చేసేవాడినని దియా మేనేజర్ చెప్పినట్టు వార్తలు వచ్చాయి. డ్రగ్స్ కేసులో ఆమెకు ఎన్సీబీ అధికారులు త్వరలో సమన్లు జారీ చేయనున్నారని కూడా తెలిసింది. డ్రగ్ సెల్లర్స్ అయిన అనుజ్ కేశ్వానీ, అంకుష్ తమను ఎన్సీబీ ఇంటరాగేట్ చేసినప్పుడు దియా మీర్జా పేరును కూడా ప్రస్తావించారు.