చినుకు పడితే చెరువు అవుతున్నా చర్యలు తీసుకోరా?!

  • జిల్లా అధికారులు కూడా చేతులెత్తేస్తే ఎలా?
  • మురుగు కంపు కొడుతున్న మున్సిపల్ పాలన
  • పట్టణ వీధుల్లో సైతం పూడికతీత పనులు చేపట్టాలి
  • మెయిన్ రోడ్ లో ఆక్రమణలు తొలగించి, కాలువుల్లో పూడిక తీత పనులు చేపట్టాలని కోరిన జనసేన పార్టీ నాయకులు

పార్వతీపురం: పట్టణ మెయిన్ రోడ్డు చినుకు పడితే చెరువు అవుతున్న చర్యలు తీసుకోరా..? అని జనసేన పార్టీ నాయకులు ప్రశ్నించారు. గురువారం ఆ పార్టీ నాయకులు వంగల దాలినాయుడు, అన్నా బత్తుల దుర్గాప్రసాద్ లు విలేకరులతో మాట్లాడుతూ కొత్తగా ఏర్పాటు అయిన పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రం పార్వతీపురం సమస్యలతో కొట్టుమిట్టాడుతోందన్నారు. పట్టణ మెయిన్ రోడ్డు ఏమాత్రం చినుకుపడిన చెరువుగా మారుతోందన్నారు. పట్టణ మెయిన్ రోడ్డులోని మురుగుకాలువలపై ఆక్రమణలు తొలగించి మురుగు కాలువల్లో పూడిక తీత పనులు చేపట్టాల్సిందిగా వేసవి నుండి సంబంధిత జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో పలుమార్లు ఫిర్యాదులు చేయడం జరిగిందన్నారు. అయినప్పటికీ జిల్లా అధికారులు సైతం చేతులెత్తేసారన్నారు. పట్టణ మెయిన్ రోడ్డులో ఇరువైపులా ఉన్న మురికి కాలువలపై ఆక్రమణలు చోటు చేసుకోవడంతో వాటిలో ఉన్న మురుగు తీత పనులు చేపట్టకపోవటంతో.. ఏ మాత్రం వర్షం పడితే వర్షం నీరు మురుగు కాలువల్లో ప్రవహించలేక రోడ్డుపైకి వస్తోందన్నారు. ఈ విషయమై పలుమార్లు సంబంధిత జిల్లా అధికారులకు, మున్సిపల్ అధికారులు దృష్టికి తీసుకువెళ్లినా చర్యలు శూన్యం అన్నారు. పార్వతీపురం మున్సిపాలిటీలో పురపాలన మురుగు కంపు కొడుతోందన్నారు. మెయిన్ రోడ్డుతో పాటు పలు వీధుల్లో మురుగు కాలువల్లో పూడిక తీత పనులు చేపట్టకపోవడంతో దోమలు, ఈగలు పెరిగి వర్షపు నీరు కూడా నిల్వ ఉండి ఆయా ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ముఖ్యంగా ఏమాత్రం వర్షం పడినా మెయిన్ రోడ్డు, సౌందర్య సినిమా హాలు ప్రాంతము, నెల్లిచెరువుగట్టు, జనశక్తి కాలనీ, బైపాస్ కాలనీ తదితర ప్రాంతాలు చెరువులుగా మారుతున్నాయన్నారు. అయినప్పటికీ సంబంధిత మున్సిపల్ యంత్రాంగం గాని జిల్లా యంత్రాంగం గాని తీసుకున్న చర్యలు శూన్యం అన్నారు. దీంతో చినుకు పడితే ఆయా ప్రాంతాలు చెరువులుగా మారుతున్నాయని, ఆయా ప్రాంతాల్లో నివాసితులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పట్టణ మెయిన్ రోడ్డు మురుగు కాలువలపై ఉన్న ఆక్రమణలు తొలగించి పూడిక తీత పనులు చేపట్టి వర్షపు నీరు మెయిన్ రోడ్ లో నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలని కోరారు. అలాగే పట్టణంలోని పలు వీధుల్లో మురుగు కాలవుల్లో పూడికతీత పనులు చేపట్టాలని కోరారు.