పాలకులకు చిత్తశుద్ధి ఉంటే వంతెన పూర్తి చేయాలి

  • తరతరాలుగా రాజకీయ పక్షాలు ఎన్నికల హామీకే వాడుతున్నాయి
  • పాలకులను ప్రజాక్షేత్రంలో ప్రశ్నించేందుకు జనసేన సిద్ధం
  • కూతుర్ని బ్రతికించుకునేందుకు చిన్నపాటి వెదురు బొంగుల తెప్పతో నది దాటించే తండ్రి తాపత్రయ దృశ్యాలేన్నో
  • పూర్ణపాడు లాభేసు సాధన సమితి రౌండ్ టేబుల్ సమావేశంలో జనసేన పార్టీ నాయకులు వంగల దాలి నాయుడు

పార్వతీపురం, పాలకులకు చిత్తశుద్ధి ఉంటే పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలోని పూర్ణపాడు లాభేసు వంతెన నిర్మాణం పూర్తి చేయాలని జనసేన పార్టీ నాయకులు వంగల దాలి నాయుడు అన్నారు. శనివారం పార్వతీపురంలోని సుందరయ్య భవనంలో పూర్ణపాడు లాభేసు వంతెన సాధన సమితి ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తరతరాలుగా పూర్ణపాడు లాభేసు వంతెనను ఎన్నికల హామీగానే రాజకీయ పక్షాలు వాడుకుంటున్నాయన్నారు. ఒకప్పటి మూడున్నర కోట్ల అంచనా వ్యయం కలిగిన వంతెన నిర్మాణం పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం వలన ఇప్పుడు సుమారు 15 కోట్లు కు చేరిందన్నారు. అయినప్పటికీ ఆ వంతెన పూర్తి నిర్మాణం చేపట్టకపోవడం అన్యాయం అన్నారు. 2006లో ప్రారంభించిన వంతెని నిర్మాణం ఇప్పటికీ పూర్తి కాకపోవటం హాస్యాస్పదమన్నారు. ఇటు నాగవళి అటు గుమ్మిడిగెడ్డ ప్రవాహాల మధ్య చిక్కుకున్న కొమరాడ మండలంలోని 9 పంచాయతీలు, 60 గ్రామాలతో పాటు కొన్ని ఒడిశా గిరిజన గ్రామాలు ప్రజలు ప్రాణాలు పణంగా పెడుతున్నారన్నారు. దాదాపు వర్షాకాలంలో అత్యవసరాలు, నిత్యవసరాలు అందక ఆయా గిరిజన గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇదంతా సంబంధిత పాలకులు, అధికారుల కళ్ళ ముందు ప్రతి ఏటా జరుగుతున్నప్పటికీ కనీసం చలనం లేకపోవడం ప్రజలు చెసుకున్న పాపం అన్నారు. ఇటీవల వెదురు బొంగులతో చిన్నపాటి తెప్పను ఏర్పాటు చేసుకొని అనారోగ్యంతో ఉన్న కూతురుని నది దాటించే తండ్రి ఉదంతాలు అయినా పాలకులను కదిలించలేకపోయాయన్నారు. ఇటీవల కురుపాం వచ్చిన ముఖ్యమంత్రి దృష్టికి కూడా ఈ వంతెన సమస్య చేరకపోవడం అక్కడ గిరిజనులు చేసుకున్న దౌర్భాగ్యం అన్నారు. తాత ముత్తా తల నుండి కొమరాడను పాలిస్తున్న పాలకులు ఈ వంతెన నిర్మాణంలో కనీసం దృష్టి పెట్టకపోవడం వారి పాలనకు అర్థం పడుతోందన్నారు. పాలకులను ప్రజాక్షేత్రంలో ప్రశ్నించిన రోజు వంతెన నిర్మాణం పూర్తవుతుందన్నారు. వంతెనను సాధించేంతవరకు జనసేన పార్టీ గిరిజనుల పక్షాన నిలిచి పోరాడుతుందన్నారు. తరాలుగా వర్షాకాలంలో అత్యవసర వైద్య సేవలకు సైతం నోచుకోక పలువురు ప్రాణాలు ఫణంగా పెడుతున్న సందర్భాలు అనేకం అన్నారు. అలాగే వర్షాకాలంలో నది దాటే క్రమంలో గల్లంతైన వారి జాబితా కూడా లెక్కలేనిదన్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి పూర్ణపాడు లాభేసు వంతెన నిర్మాణం పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.