అప్రకటిత కరెంట్ కోతలను ఆపకపోతే.. జిల్లా వ్యాప్తంగా విద్యుత్ భవనాలతో పాటూ ఎమ్మెల్యేల కార్యాలయాలనూ ముట్టడిస్తాం

  • పెరిగిన ఉష్ణోగ్రతలకు తోడూ కరెంట్ కోతలతో అల్లాడుతున్న ప్రజలు
  • వినియోగానికి తగ్గట్టుగా విద్యుత్ ను సమకూర్చుకోవటంలో పాలకులూ, అధికారులు విఫలమయ్యారు
  • ప్రజల బాధలు పట్టని ఎమ్మెల్యేలు
  • వైసీపీ నేతలకు దమ్మూధైర్యం ఉంటే ఇప్పుడు గడప గడపకు రావాలి
  • కార్పొరేటర్ నుంచి ఎమ్మెల్యే వరకు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ పాలనపై, అధికారులపై పట్టుకోల్పోయిన దుస్థితి
  • అనధికార కోతలను నియంత్రించకపోతే విద్యుత్ భవనాలతో పాటూ శాసనసభ్యుల కార్యాలయాలనూ ముట్టడిస్తాం
  • జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి

గుంటూరు: జిల్లాలో అనధికారికంగా విధిస్తున్న కరెంట్ కోతలను యుద్ధప్రాతిపదికన అరికట్టకపోతే విద్యుత్ భవనాలతో పాటూ ఎమ్మెల్యేల కార్యాలయాలను ముట్టడిస్తామని జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. కొన్ని రోజులుగా వేళాపాళా లేకుండా అనధికారికంగా కరెంట్ కోతలను విధించటంపై ఆయన గురువారం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఇంట్లో ఉంటే ఉక్కపోతతో , బయటికి వెళ్తే వడగాల్పులతో ప్రజలు అల్లాడుతున్నారన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇళ్లల్లో కరెంట్ లేకపోతే ప్రజలు ఎలా ఉండారని ప్రశ్నించారు. పిల్లలు , వృద్ధుల పరిస్థితి మరింత దారుణంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వేసవికాలంలో విద్యుత్ వాడకం ఎక్కువ ఉంటుందన్న విషయం ప్రభుత్వానికి , అధికారులకు తెలియదా అని విమర్శించారు. ఈ సంవత్సరం ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉంటాయని జాతీయ విపత్తు సంస్థలు మొత్తుకుంటున్నా పాలకులు , అధికారులు మొద్దు నిద్రపోతున్నారని ధ్వజమెత్తారు. వేసవికాలం సమీపిస్తున్న సమయంలో ఒక్కసారి కూడా విద్యుత్ పంపిణీపై సమీక్షలు నిర్వహించలేనంత దుస్థితిలో పాలకులున్నారని విమర్శించారు . గుంటూరు నగరం మొత్తం విద్యుత్ కోతలతో ప్రజలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నా స్థానిక శాసనసభ్యులు మద్దాలి గిరి , మహమ్మద్ ముస్తఫాలు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించటం సిగ్గుచేటన్నారు. ఏసీ కార్లలో తిరుగుతూ , ఏసీ గదుల్లో ఉండే వాళ్ళకి ప్రజల అవస్థలు ఎట్లా తెలుస్తాయని దుయ్యబట్టారు. వైసీపీ నేతలకు దమ్మూ ధైర్యం ఉంటే ఇప్పుడు గడప గడపకు వచ్చి మా నమ్మకం నువ్వే స్టిక్కర్లు అతికించాలని కోరారు. సర్ చార్జీల పేరుతో పాటూ వివిధ రకాలుగా విద్యుత్ చార్జీలు విపరీతంగా పెంచి ముక్కుపిండి వసూలు చేయడంపై ఉన్న శ్రద్ధ విద్యుత్ ను నిరంతర సరఫరా చేయకపోవటంపై లేదని మండిపడ్డారు. విద్యుత్ ఆగిన సమయంలో అధికారులు కనీస సమాచారం కూడా చెప్పకపోగా ఇష్టానురీతిలో అహంకారపూరితంగా సమాధానాలు చెతున్నారన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ఈ లు, డీ ఈ లు ఫోన్ ఎత్తటమే మహాభాగ్యంగా మారిందన్నారు. స్థానిక శాసనసభ్యులు, కార్పొరేటర్ లు పరిపాలన పట్ల బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడంతో పాలనపై అధికారులపై పట్టు కోల్పోయారన్నారు. ఇప్పటికైనా అప్రకటిత విద్యుత్ అంతరాయాలను నిలువరించకపోతే జనసేన పార్టీ జిల్లా, నగర అధ్యక్షుల సూచనలతో విద్యుత్ భవనాలను, శాసనసభ్యుల కార్యాలయాలను ముట్టడిస్తామని ఆళ్ళ హరి హెచ్చరించారు.