‘దిశ యాప్’ ఉంటే అన్న తోడుగా ఉన్నట్టే: సీఎం వైఎస్ జగన్

ఆపదలో ఉన్న మహిళలు, యువతులను కాపాడే అస్త్రం ‘దిశ యాప్’ అని, ఆ యాప్  ఫోన్ లో ఉంటే అన్న తోడుగా ఉన్నట్టేనని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి ‘దిశ యాప్’పై అవగాహన కల్పించాలని, ఆ యాప్ కు మహిళా పోలీసులు, వాలంటీర్లే అంబాసిడర్లని చెప్పారు. మహిళలందరితోనూ యాప్ ను డౌన్ లోడ్ చేయించాలని వారికి సూచించారు. ఈరోజు ఆయన విజయవాడలోని గొల్లపూడిలో నిర్వహించిన దిశ యాప్ అవగాహన సదస్సులో పాల్గొన్నారు.

ప్రకాశం బ్యారేజీ ఘటన కలచి వేసిందని, యువతులు, మహిళల భద్రతకోసమే ఈ దిశ యాప్ ను రూపొందించామని ఆయన చెప్పారు. స్మార్ట్ ఫోన్ ఉండే ప్రతి మహిళా ఈయాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఇప్పటికే 17 లక్షల మందికిపైగా ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారని, యాప్ కు నాలుగు అవార్డులు కూడా వచ్చాయని ఆయన వివరించారు.

పోలీసులు మంచి చేసే ఆప్తులన్నారు. మహిళల భద్రత, రక్షణపై వెనకడుగు వేయబోమని ఆయన చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో 18 దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశామని, దిశ చట్టాన్నీ తెచ్చామని గుర్తు చేశారు. త్వరలోనే ప్రత్యేక కోర్టులనూ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.