అసెంబ్లీలో ధర్నాకు దిగిన టీడీపీ సభ్యులు.. 10 మంది సస్పెండ్..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చివరి రోజు సమావేశాల్లో గందరగోళం నెలకొంది. సభ ప్రారంభమైన కొద్ది సేపటికే టీడీపీ ప్రజాప్రతినిధులు ఆందోళనకు దిగారు. పెండింగ్‌లో ఉన్న రూ.2500 కోట్ల ఉపాధి హామీ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ స్పీకర్ పోడియం ముందు నిరసన చేపట్టారు. అయితే చివరి రోజు సమావేశాలు కావడంతో కీలక బిల్లుపై చర్చించాల్సి ఉందని, సహకరించాలని స్పీకర్ టీడీపీ నేతలను కోరారు. అయినప్పటికీ టీడీపీ నేతలు తమ నిరసనను కొనసాగించారు. స్పీకర్ పోడియం ఎక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాగా, టీడీపీ నేతలు స్పీకర్ పోడియం ఎక్కడంతో స్పీకర్ తమ్మినేని సీతారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సరైన పద్ధతి కాదని హితవుచెప్పారు. అయినప్పటికీ వినకపోవడంతో 10 మంది టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారం ప్రకటించారు.