ఈ-పాస్‌ ఉంటేనే తెలంగాణలోకి అనుమతి

ఆంధ్రా-తెలంగాణ సరిహద్దులో రామాపురం క్రాస్‌రోడ్‌ చెక్‌పోస్టు వద్ద భారీగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఆదివారం కావడంతో ఆంధ్రా నుంచి తెలంగాణ వైపు భారీగా వాహనాలు వెళ్తున్నాయి. ఈ-పాస్‌ లేని వాహనాలను తెలంగాణ పోలీసులు వెనక్కి పంపిస్తున్నారు.

తెలంగాణలో పగటిపూట లాక్‌డౌన్‌ ఎత్తేశారని ప్రయాణికులు రామాపురం చెక్‌పోస్టు వద్దకు చేరుకుంటున్నారు. దీంతో చెక్‌పోస్టు వద్ద వాహనాల తాకిడి పెరిగింది. ఆంధ్ర నుంచి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా ఈపాస్‌ ఉంటేనే కోదాడ పోలీసులు అనుమతిస్తున్నారు. ఈపాస్‌ లేని వాహనాలను వెనక్కి పంపిస్తున్నారు. దీంతో వందలసంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. గంటల కొద్దీ పడిగాపులు కాస్తున్న ప్రయాణికులు చేసేదిలేక వెనుదిరిగి వెళ్తున్నారు. ఈపాస్‌లేని వాహనాలకు అనుమతి లేదని కోదాడ రూరల్‌ ఎస్‌ఐ సైదులు తెలిపారు. రాత్రి నుంచి ఇప్పటి వరకు ఈపాస్‌ ఉన్న 700 వాహనాలను అనుమతించామని, ఈపాస్‌లేని 1500 వాహనాలను వెనక్కు పంపించామని ఎస్‌ఐ తెలిపారు. ప్రయాణికులు తెలంగాణ పోలీసులకు సహకరించి ఈపాస్‌తో రావాలని సూచించారు.