‘అయామ్ నో మెస్సయ్య!’

సోనూసూద్.. ఇంతకుముందు రీల్‌లైఫ్‌ విలన్‌.. గానే మనకు తెలుసు.. అయితే, లాక్ డౌన్ సమయం నుంచీ రియల్‌ లైఫ్‌ హీరోగా పేరుతెచ్చుకున్నాడు. కరోనా మహమ్మారి వల్ల ప్రపంచం మొత్తం అతలాకుతలైపోతే.. జనమంతా ప్రాణాలు చేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడిపారు. కానీ.. సోనూసూద్‌ మాత్రం అభాగ్యులను ఆదుకోవడానికి నడుంకట్టాడు. లాక్ డౌన్ సమయంలో దేశంలోని వివిధ ప్రాంతాలలో చిక్కుకుపోయి, అష్టకష్టాలు పడ్డ వలస కార్మికులను ఆదుకుని.. ప్రత్యేక బస్సులు వేసి, వారిని స్వస్థలాలకు చేర్చిన హీరో అతను. అలాగే, ఇప్పటికీ ఆపదలో వున్న ఎంతోమందిని ‘నేనున్నా..’నంటూ ఆదుకుంటున్న రక్షకుడు అతను!

అందుకే అతని అంతా ఇప్పుడు ‘మెస్సయ్య’ (రక్షకుడు) అంటూ అతనికి తమ మనసులలో దైవ స్థానాన్ని కట్టబెట్టారు. అయితే, తాను మాత్రం మెస్సయ్యను ఎంతమాత్రం కానని సోనూసూద్ వినమ్రంగా చెబుతున్నాడు. ఇందుకోసం ఏకంగా ఓ పుస్తకాన్ని రాశాడు. దీని పేరు ‘అయామ్ నో మెస్సయ్య!’ జర్నలిస్టు మీనా అయ్యర్ తో కలసి ఆయన ఈ పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకాన్ని పెంగ్విన్ ఇండియా సంస్థ ప్రచురిస్తోంది.

ఈ సందర్భంగా సోనూసూద్ చెబుతూ, ‘నేనూ మామూలు మనిషినే. ఆ సమయంలో నేను చేయగలిగిన సాయం చేశాను అంతే. అయితే, ప్రజలు నా పట్ల ఎక్కువ దయ చూపిస్తున్నారు. సాటి మనిషికి సాయం చేయడం మన బాధ్యత. ఇక ఈ పుస్తకం డిసెంబర్లో మార్కెట్లోకి వస్తుంది. ఇది నా జీవిత చరిత్ర.. అంటే వేలాదిమంది వలస కార్మికుల కథ’ అంటూ ట్వీట్ చేశాడు.