రెండో మ్యాచ్‌లోనూ సింధు, శ్రీకాంత్ ల ఓటమి

బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ టూర్‌ ఫైనల్స్ రెండో మ్యాచ్‌లోనూ భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధుకు నిరాశే ఎదురైంది. మహిళల సింగిల్స్‌ గ్రూప్‌-బిలో భాగంగా గురువారం జరిగిన రెండో మ్యాచ్‌లో సింధు 19-21, 13-21తో రచనోక్‌ ఇంతనాన్‌ (ఇండోనేషియా) చేతిలో ఓటమి పాలైంది. సూపర్‌ ఫామ్‌లో ఉన్న రచనోక్‌ ధాటికి వరుసగా రెండు గేమ్‌ల్లో ఓడిన ప్రపంచ ఛాంపియన్‌ సింధు మూల్యం చెల్లించుకుంది. తొలి గేమ్‌లో ప్రత్యర్థికి పోటీనిచ్చిన సింధు.. రెండో గేమ్‌లో మాత్రం చేతులెత్తేసింది.

శుక్రవారం జరిగే మూడో మ్యాచ్‌లో తెలుగు తేజం పీవీ సింధు.. తక్కువ ర్యాంకు అమ్మాయి పోర్న్‌పావీ చోచువాంగ్‌తో తలపడనుంది. నలుగురు షట్లర్లున్న గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన వారు తర్వాతి రౌండ్‌కు అర్హత సాధిస్తారు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిన సింధు సెమీస్‌ చేరే అవకాశాన్ని దాదాపు చేజార్చుకుంది. ఏదైనా అద్భుతం జరిగే తప్ప సింధు సెమీస్‌ చేరే అవకాశం లేదు. ‘ఇది నా రోజు కాదు. తొలి ఆటను కోల్పోవడం వల్లే తేడా వచ్చింది. నా టైమింగ్ బాలేదు. ఈ ఓటమి నన్ను నిరాశపరిచింది’ అని మ్యాచ్ అనంతరం సింధు చెప్పింది.

మరోవైపు పురుషుల సింగిల్స్‌ గ్రూప్‌-బిలో భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్‌కు కూడా ఎదురుదెబ్బ తగిలింది. వాంగ్ త్జు వీహేపై 19-21, 21-9, 21-19 తేడాతో శ్రీకాంత్‌పై విజయం సాధించాడు. మొదటి గేమ్ గెలిచిన శ్రీకాంత్.. రెండో గేమ్‌ను చిత్తుగా కోల్పోయాడు. మూడో గేమ్‌లో గట్టిపోటీ ఇచ్చినా వీహే ముందు తేలిపోయి మ్యాచ్ కోల్పోయాడు. శ్రీకాంత్ సెమీస్‌ చేరే అవకాశం దాదాపు లేనట్టే.

తొలి రౌండ్‌లో పీవీ సింధు 21-19, 12-21, 17-21తో వరల్డ్‌ నంబర్‌ వన్‌ తై జు యింగ్ (చైనీస్‌ తైపీ) చేతిలో పరాజయం పాలైంది. 59 నిమిషాల పాటు జరిగిన పోరులో తొలి గేమ్‌ను సొంతం చేసుకున్న సింధు.. తర్వాతి రెండు గేమ్‌ల్లో ప్రత్యర్థి ధాటి ముందు నిలువలేకపోయింది. ఇక అండర్స్ ఆంటోన్సెన్ (డెన్ మార్క్) చేతిలో 21-15, 16-21, 18-21తో శ్రీకాంత్ ఓటమిపాలయ్యాడు.