వైకాపాలో కాపు నేతలు డబ్బా మాటలు మానుకోవాలి..!

  • కాపుల అభివృద్ధికి ఏం చేశారో చెప్పాలి……?
  • పవన్ కల్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం
  • మీడియాతో జన సేన నగర అధ్యక్షులు మలగా రమేష్ ధ్వజం

వైకాపాలో కాపు నేతలు, ప్రజాప్రతినిధులు డబ్బా మాటలు ముందు మానుకొని, కాపుల అభివృద్ధికి ఏం చేశారో చెప్పాలని జనసేన నగర అధ్యక్షులు, కార్పొరేటర్ మలగా రమేష్ సూటిగా ప్రశ్నించారు. మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో జగన్ ప్రభుత్వం పై ధ్వజమెత్తారు. వైకాపా ప్రభుత్వంలో ఉన్న కాపు సామాజిక వర్గ మంత్రులు, శాసనసభ్యులు, ఎంపీలు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. పవన్ కల్యాణ్ పై ఆయన కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోబోమన్నారు. రాజమండ్రిలో విందు ఏర్పాటు చేసుకొని జనసేన పార్టీ పైన వ్యాఖ్యలు చేయడం ప్రజలంతా చూస్తున్నారన్నారు. జగన్ ప్రభుత్వం కాపుల అభివృద్ధికి, సంక్షేమానికి ఏమి చేశారో చెప్పాలని ప్రశ్నించారు. కాపు కార్పొరేషన్ కూడా ఎత్తివేశారన్నారు. ఇప్పటి వరకు కాపు అభివృద్ధి ఖర్చు పెట్టిన నిధుల వివరాలకు సంబంధించి శ్వేత పత్రం విడుదల చేయగలరా….? అని మలగా ప్రశ్నించారు.
నగర ఉపాధ్యక్షులు పిల్లి రాజేష్ మాట్లాడుతూ సోమవారం వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడిన మాటలకు సమాధానంగా మీ 30 ఏళ్ల రాజకీయ జీవితంలో పరాయి కులస్తుల పంచన చేరి బానిస జీవితం గడిపిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు మీ స్వప్రయోజనం కోసం కేవలం ఒక పదవి కోసం మిమ్మల్ని నమ్ముకుని ఓట్లు వేసిన రామచంద్రపురం ప్రజలని వదిలేసి మండపేట ఎందుకు చేరాలని ప్రశ్నించారు గత ప్రభుత్వ హయాంలో మీ ఆధ్వర్యంలో ఎంతోమంది కాపు యువకుల మీద నాయకుల మీద బైండోవర్ కేసులు రౌడీ షీట్లు తెరిచిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు అలాగే రంగా గారిని చంపిన వ్యక్తుల్ని చేర్చుకున్న పార్టీ వైసిపి అని రంగా గారిని తిట్టిన వ్యక్తిని నామినేటెడ్ పదవి అప్పజెప్పి అందలం ఎక్కించిన ఘనత వైసిపి పార్టీది అని ఎద్దేవా చేశారు. జనసేన వీర మహిళలు బొందిల శ్రీదేవి, పల్ల ప్రమీల, ఆకుపాటి ఉష మాట్లాడుతూ వైకాపా పెయిడ్ ఆర్టిస్టులు మెగా కుటుంబాన్ని తిట్టేటప్పుడు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం మీద నిందలు వేసేటప్పుడు ఈ మంత్రులు ఎంపీలు ఏమయ్యారు అని ప్రశ్నించారు. ఏదైనా మాట్లాడే ముందు తెలుసుకొని మాట్లాడటం నేర్చుకోవాలని సూచించారు. జనసేన నాయకులు చనపతి రాంబాబు మాట్లాడుతూ నిన్న రాజమండ్రిలో సమావేశమైన వాళ్ళు రంగా గారి పేరు ఒక జిల్లాకి పెట్టలేనప్పుడు ఈ కాపు నాయకులంతా వారి పౌరుషాన్ని సీఎం జగన్ రెడ్డి దగ్గర తాకట్టు పెట్టారా అని ప్రశ్నించారు. కాపులకి ఏదైనా అన్యాయం జరిగితే వీళ్లంతా ఎందుకు నోరు మెదపరని ప్రశ్నించారు. సోమవారం జరిగిన వైకాపా కాపు నాయకుల సమావేశంలో కాపులు అని చెప్పుకుంటున్న నాయకుల ప్రవర్తన చాలా అసహ్యకరంగా ఉందని ముక్తకంఠంతో ఖండించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పోకల నరేంద్ర సుభాని, ఆలా నారాయణ, బొందిల మధు తదితరులు పాల్గొన్నారు.