తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత..

తెలంగాణలో గత మూడు రోజులుగా చలి పులి పంజా విసురుతుంది. పగటి పూట ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిలోనే నమోదవుతున్నా.. రాత్రిల్లో ఉష్ణోగ్రతలు కనిష్టానికి నమోదవుతున్నాయి. తూర్పు, ఈశాన్య దిశల నుంచి వీస్తున్న గాలులతో ఉష్ణోగ్రతలు కనిష్టానికి తగ్గుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం ఆదిలాబాద్ జిల్లాలో పలు ప్రాంతాల్లో అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా లో 7 డిగ్రీలు, కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా గిన్నెధరిలో 7.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌, సంగారెడ్డి, కామారెడ్డి, మంచిర్యాల జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 7 నుంచి 9.2 డిగ్రీల వరకు రికార్డ్ అయ్యాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈశాన్య గాలులతో ఉష్ణోగ్రతలు పడిపోవడంతోపాటు పలుచోట్ల పొగమంచు కురుస్తున్నది. పొగమంచుతో తెల్లవారు జామున ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.