రోహింగ్యాలను తరిమికొడతాం: అమిత్ షా

ఒక్కసారి అధికారం ఇవ్వండి హైదరాబాద్ లో ఉన్న రోహింగ్యాలను ఎలా తరిమికొడతామో చుడండని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. బంగ్లాదేశీయులు, రోహింగ్యాలను వెళ్లగొట్టాలని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ లిఖిత పూర్వకంగా చెబితే కేంద్ర ప్రభుత్వం స్పందన ఎలా ఉంటుందో చూపిస్తామని రోడ్‌షో అనంతరం మీడియాతో ఆమిత్‌షా మాట్లాడుతూ, బంగ్లాదేశీయులు, రోహింగ్యాలపై పార్లమెంటులో ఎప్పుడు చర్చ జరిగినా వాళ్ల వైపు మాట్లాడేదెవరు? ప్రజలకు ఈ విషయం బాగా తెలుసు.. అని ఒవైసీపై విసుర్లు విసిరారు.

‘నేను ఏ చర్య తీసుకున్నా పార్లమెంటులో వాళ్లు గందరగోళం సృష్టిస్తారు. ఆయన ఎలా గట్టిగా అరుస్తారో మీరు చూడలేదా? బంగ్లాదేశీయులు, రోహింగ్యాలను వెళ్లగొట్టమని వారిని చెప్పమనండి. వెంటనే ఆ పని చేసి చూపిస్తాను. కేవలం ఎన్నికల్లో మాట్లాడితే సరిపోదు. పార్లమెంటులో ఈ విషయాన్ని లేవనెత్తినప్పుడు రోహింగ్యాలు, బంగ్లాదేశీయుల వైపు మాట్లాడిందెవరు? టీవీ లైవ్‌లో ప్రజలు చూడలేదా?’ అని అమిత్‌షా అన్నారు. అక్రమంగా రోహింగ్యాలు ఇక్కడ (హైదరాబాద్) ఉంటే, హోం మంత్రి ఏం చేస్తున్నారంటూ ఒవైసీ ఇటీవల ప్రశ్నించారు.

నిజాం సంస్కృతి నుంచి హైదరాబాద్‌కు విముక్తి కలిగించాలని అమిత్‌షా అన్నారు. ఆ పని తాము చేస్తామని, ప్రజాస్వామ్య సిద్ధాంతాలకు లోబడి హైదరాబాద్‌ను మోడ్రన్ సిటీగా తీర్చిదిద్దేందుకు పాటుపడతామని చెప్పారు. ఆనువంశిక పాలనకు, మభ్యపెట్టే రాజకీయాలకు తాము చరమగీతం పాడతామని అమిత్‌షా అన్నారు.