చైనా బలగాల కదలికలపై పెంచిన నిఘా

భారత్‌-చైనా సరిహద్దుల్లో చైనా సేనలను భారత సైన్యం సమర్థంగా ఎదుర్కొంటుoది అని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటిస్తూ.. సరిహద్దుల్లో శాంతియుత వాతావరణం ఉండాలని భారత్ కోరుకుంటున్నదని అన్నారు. భారత్‌-చైనా సరిహద్దు సమస్యపై రక్షణ మంత్రి రాజ్యసభలో ప్రకటన చేశారు. లఢక్‌లో అనేక అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. చైనా సరిహద్దుల్లో ప్రస్తుతం సున్నితమైన సమస్యలు ఉన్నాయని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో వాటిని వివరించలేనని, ఈ విషయాన్ని సభ అర్థం చేసుకుంటుందని ఆశిస్తున్నానన్నారు.

చైనా మాటలకు  చేతలకు సంబంధం లేకుండా వ్యవహరిస్తుందని.. చైనాతో ఎలాంటి పరిస్థితులున్నా తాము ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. చైనా చర్యలకు భారత సాయుధ బలగాలు ఇప్పటికే గట్టిగా సమాధానమిచ్చాయని వెల్లడించారు.

1988 తర్వాత భారత్‌, చైనాలు అనేక ఒప్పందాలు చేసుకున్నాయని రాజ్‌నాథ్‌ గుర్తు చేశారు. సరిహద్దు ఒప్పందాలను ఉల్లంఘించడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. 1962లో చైనా 38వేల చదరపు కిలోమీటర్ల మేర భారత భూభాగాన్ని ఆక్రమించిందని తెలిపారు.

సరిహద్దు ఒప్పందాలను ఉల్లంఘించడం మంచిది కాదని చైనాకు సూచించారు. సరిహద్దుల్లో శాంతియుత పరిస్థితులు ఉండాలని భారత్ కోరుకుంటున్నదని చెప్పారు. అయితే చైనామాత్రం సరిహద్దుల్లో భారత్‌ను కవ్విస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. చైనా బలగాలను భారత్ సైన్యం సమర్థంగా అడ్డుకుంటున్నాయని చెప్పారు. చైనా బలగాల కదలికలపై నిఘా తీవ్రతరం చేశామన్నారు. ప్రధాని మోదీ లఢక్ వెళ్లి సైనికులకు భరోసా ఇచ్చిన విషయాన్ని పేర్కొన్నారు.