బైడెన్ కు అండగా భారతీయ అమెరికన్లు

అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికల లో రిపబ్లికన్ పార్టీ నుంచి ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోమారు పోటీలో నిలవగా. డెమొక్రాటిక్ పార్టీ తరపున మాజీ ఉపాధ్యక్షుడు జో బైడెన్ అధ్యక్ష బరిలో ఉన్నారు. ఇదిలా ఉంటే.. వీరిద్దరి తరపున ఇప్పటివరకు నిధుల సేకరణలో అనేక మంది పాలుపంచుకున్నారు. వారిలో ఇండియన్ అమెరికన్స్ కీలక పాత్ర పోషించడం విశేషం. జో బైడెన్ కోసం అత్యధిక విరాళాలు సేకరించిన వారిలో 21 మంది ఇండియన్ అమెరికన్స్ ఉన్నట్టు బైడెన్ క్యాంపెయిన్ శనివారం వెల్లడించింది. ఈ 21 మందిలో ప్రతి ఒక్కరు లక్ష డాలర్ల కంటే ఎక్కువగానే విరాళాలను సేకరించినట్టు క్యాంపెయిన్ తెలిపింది.

అగ్రరాజ్యంలోని భారతీయులు తనకు మద్దతుగా నిలిచి.. తమ పార్టీకి సుమారు లక్ష డాలర్ల మేరకు ఆర్థిక సహాయం అందించారని బైడెన్‌ ఈ సందర్భంగా వివరించారు. వారిలో స్వదేశ్‌ ఛటర్జీ, రమేశ్‌ కపూర్‌, శేఖర్‌ ఎన్‌ నరసింహన్‌, ఆర్‌ రంగస్వామి, అజయ్‌ జైన్‌ భుటోరియా, ఫ్రాంక్‌ ఇస్లాం తొలి వరుసలో ఉన్నారు. మరికొందరు ప్రముఖుల్లో నీల్‌ మఖీజా, రాహు, ప్రకాశ్‌, దీపక్‌ రాజ్‌, రాజ్‌ షా, రాజన్‌ షా, రాధికా షా, జిల్‌ సింగ్‌, రాజ్‌ సింగ్‌, నిధి థాకర్‌, కిరణ్‌ జైన్‌, సోనీ కాల్సి, బేలా బజారియా తదితరులు ఉన్నారు. భారతీయ సంతతికి చెందిన కాంగ్రెస్‌ సభ్యురాలు ప్రమీలా జయపాల్‌ కూడా ఈ జాబితాలో ఉండటం విశేషం.