49 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ లో సెమీస్ చేరిన భారత పురుషుల హాకీ జట్టు

భారత పురుషుల హాకీ జట్టు టోక్యో ఒలింపిక్స్ లో అచ్చెరువొందించే ఆటతీరుతో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈ సాయంత్రం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ 3-1తో బ్రిటన్ పై నెగ్గింది. తద్వారా 49 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ లో సెమీస్ చేరింది. 1972 ఒలింపిక్స్ లో సెమీఫైనల్ చేరిన తర్వాత భారత పురుషుల హాకీ జట్టు మరోసారి సెమీస్ చేరడం ఇదే ప్రథమం.

మళ్లీ ఇన్నాళ్లకు టోక్యో ఒలింపిక్స్ లో పునర్ వైభవాన్ని గుర్తు చేస్తూ మేటి జట్లను మట్టి కరిపించి సెమీఫైనల్ చేరింది. సెమీఫైనల్లో భారత జట్టు బెల్జియంతో తలపడనుంది. 1980 ఒలింపిక్స్ లో భారత్ పసిడి నెగ్గినా, ఆ ఈవెంట్ లో సెమీఫైనల్ దశ లేదు.