RCB ఖాతాలో మరో విక్టరీ

శనివారం రాత్రి దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో టీమిండియా కెప్టెన్‌, మాజీ కెప్టెన్ ల మధ్య సాగిన పోరులో టీమిండియా కెప్టెనే పై చేయి సాధించాడు. బెంగళూరు రాయల్ చాలెంజర్స్ మరో అద్భుత విజయాన్ని సాధించింది. కెప్టెన్ కోహ్లీ సుడిగాలి ఇన్నింగ్స్‌తో.. సూపర్ విక్టరీ దక్కించుకుంది. చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ 37 పరుగుల తేడాతో విజయం సాధించింది. చెన్నైను 132 పరుగులకే కట్టడి చేసి.. మరో గెలుపును ఖాతాలో వేసుకుంది. అద్భుతమైన ఆటతీరుతో విరాట్ కోహ్లీ తన అభిమానులకు అలరించాడు. 52 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులతో 90 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. టీం మంచి స్కోరును అందించాడు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్సీబీ… ఆదిలోనే అరోన్‌ ఫించ్‌ వికెట్‌ను కోల్పోయింది. ఆ తరుణంలో పడిక్కల్‌, విరాట్‌ కోహ్లిలు జట్టు స్కోరును చక్కదిద్దారు. ఈ జోడి 53 పరుగులు చేశాక పడిక్కల్‌ ఔటయ్యాడు. కోహ్లి కడవరకూ క్రీజ్‌లో ఉండటంతో పాటు శివం దూబేలు బ్యాట్‌ ఝుళిపించడంతో ఆర్సీబీ 169 పరుగులు చేయగలిగింది. 52 బంతుల్లో 90 పరుగులు చేసి అజేయంగా నిలిచిన కోహ్లీ జట్టు గౌరవప్రదమైన స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.

ఇక, 170 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన సీఎస్‌కే జట్టులో అంబటి రాయుడు, జగదీషన్‌ రాణించగా, మిగిలిన బ్యాట్స్‌మన్ విఫలమయ్యారు. ఉదాన వేసిన 18 ఓవర్‌ మూడో బంతికి రాయుడు క్లీన్‌బౌల్డ్ కావడంతో… సీఎస్‌కే లక్ష్య ఛేదనలో చతికిలబడింది. నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 132 పరుగులే చేయగలిగింది. ఐపీఎల్ అనగానే హాట్ ఫేవరేట్‌లా కనిపించే చెన్నై ఈసారి చెత్త ప్రదర్శనతో డీలా పడింది. ఏడు మ్యాచులాడిన చెన్నై కింగ్స్.. ఐదింటిలో ఓటమిపాలైంది.