250వ రోజుకు చేరుకున్న అమరావతి రైతుల దీక్ష

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుంచి విశాఖపట్టణం మార్చేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ రాజధాని రైతులు ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే. అయితే వారి నిరసన ఆదివారంతో 250వ రోజుకు చేరుకుంది. ఈ క్రమంలో స్థానిక మాజీ ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర రెడ్డి తన స్వగృహంలో అమరావతి ప్రాంత రైతుల దీక్షలకు మద్దతుగా సామూహిక దూరం పాటిస్తూ మూడు రాజధానులు వద్దు..అమరావతి ముద్దు అంటూ రైతులకు సంఘీభావం తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదని, వెనక్కి తీసుకోవాలని జయనాగేశ్వర రెడ్డి కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజధానిని మార్చొద్దని మహిళలు చెబుతోన్న మాటలు అక్షర సత్యాలు అని, ప్రభుత్వం మాత్రం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని దీంతో ప్రభుత్వ చర్యలను చూసి ప్రజలు చీదరించుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. కానీ వైసీపీ నేతలు మాత్రం ప్రజలను ఓదార్చేలా కాకుండా భయపెట్టేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 60 ఏళ్లు హైదరాబాద్ అభివృద్ది చేస్తే కట్టుబట్టలతో బయటకొచ్చామని.. రాష్ట్రం వీడిపోయిన తర్వాత ప్రజల ఆశలకు టీడీపీ రూపకల్పన చేసిందన్నారు. కానీ ప్రభుత్వం మారడంతో రాజధాని మార్పు పేరుతో రాజకీయాలు జరుగుతున్నాయని తెలిపారు.