శ్రీశైలం ఘటనపై స్పందించిన జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు

శ్రీశైలం ఘటనపై స్పందిస్తూ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు 9 మంది చనిపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటన జరిగిన గంటల్లోనే మంత్రి, తాను అక్కడికి చేరుకున్నామని, సిబ్బందిని కాపాడేందుకు అనేక ప్రయత్నాలు చేశామని వెల్లడించారు. ఆటోమెటిక్‌గా ట్రిప్‌ కావాలి..కానీ కాలేదని తెలిపారు. ఎందుకు ట్రిప్‌ కాలేదన్నదానిపై కమిటీ వేశామని ప్రకటించారు. ప్లాంట్‌లో పవర్‌ పోవడంతో వెంటిలేషన్‌ ఆగిపోయిందని, అత్యవసర దారి కూడా తెరుచుకోలేదని ప్రభాకర్‌రావు చెప్పారు. పొగ కారణంగా ఆక్సిజన్ లభించలేదని, ఇంకా లోనికి వెళ్లడానికి వీలు లేదని, ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. పవర్‌ జనరేషన్ ఎక్కువ ఉందని ఆపేశామని, వస్తున్న ఆరోపణలు అవాస్తవమని చెప్పారు. మృతుల కుటుంబాలకు జెన్‌కో తరపున సాయం చేస్తామని, ప్రమాదంపై ఇంటర్నల్ కమిటీ వేశామని ప్రభాకర్‌రావు తెలిపారు.