ఇంజనీరింగ్‌, మెడికల్‌ కాలేజీల్లో విద్యార్థినులకు 33 శాతం సీట్లు: నితీష్‌ ప్రతిపాదన..!

ఇంజనీరింగ్‌, మెడికల్‌ కాలేజీల్లో 33 శాతం సీట్లను విద్యార్ధినులకు కేటాయించాలని బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ బుధవారం ప్రతిపాదన చేశారు. రాష్ట్రంలో వైద్య, ఇంజనీరింగ్‌ విశ్వవిద్యాలయాల ఏర్పాటు గురించి ఆరోగ్య, విజ్ఞాన, సాంకేతిక విభాగాలు ఇచ్చిన ప్రజెంటేషన్లు పరిశీలిస్తున్న సమయంలో ఈ ప్రతిపాదన వచ్చింది. యూనివర్శిటీల ఏర్పాటు చేయడం వల్ల ఇంజనీరింగ్‌, మెడికల్‌ కాలేజీల్లో మెరుగైన నిర్వహణకు దోహదపడుతుందని భావించిన ఆయన… 33 శాతం సీట్లను విద్యార్థినులకు కేటాయించాలని అన్నారు. ‘ఇదొక సరికొత్త, ప్రత్యేకమైన ప్రయత్నం. ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఈ సాంకేతిక సంస్థల్లో బాలికలు అధికంగా నమోదు అయ్యేలా చూడాలి. అలా చేస్తే బాలికలు ఇటువంటి కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి కనబరుస్తారు, ఇతరులను ప్రోత్సహిస్తారు’ అని అన్నారు. తగినంత సంఖ్యలో ఇంజనీరింగ్‌, మెడికల్‌ కళాశాలలను ఏర్పాటు చేయడం వల్ల ఈ విభాగాలపై ఆసక్తి ఉన్న విద్యార్ధి, విద్యార్థునులు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన అవసరం ఉండదని అన్నారు.