IPL 2021: గెలిచిన ముంబై ఇండియన్స్.. హైదరాబాద్ కు హ్యాట్రిక్‌ ఓటమి

ఐపీఎల్‌ 14వ సీజన్‌లో  సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కు మరోసారి ఓటమి ఎదురైంది. వరుసగా ఇది మూడోసారి ఓడిపోవడం. ఐపీఎల్‌ 2021 సీజన్‌లో సన్‌రైజర్స్‌ హ్యాట్రిక్‌ ఓటమి నమోదు చేసింది. ముంబై ఇండియన్స్‌ నిర్దేశించిన 151 పరుగుల ఛేజింగ్ లో సన్‌రైజర్స్‌ 19.4 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌటైంది. దీంతో ముంబై 13 పరుగుల తేడాతో విజయం సాధించింది.

బెయిర్‌స్టో (43: 22 బంతుల్లో 3ఫోర్లు, 4సిక్సర్లు), డేవిడ్‌ వార్నర్‌ (36/ 34 బంతుల్లో 2ఫోర్లు, 2సిక్సర్లు) మెరుపు ఆరంభాన్ని అందించినా ఓటమి తప్పలేదు. విజయ్‌ శంకర్‌(28) కాసేపు పోరాడాడు. విజయం సాధించే అవకాశాలు ఉన్నప్పటికీ, కీలక సమయంలో బాధ్యతాయుత ఇన్నింగ్స్‌ ఆడలేకపోయాడు. ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్‌, రాహుల్‌ చాహర్‌ చెరో మూడు వికెట్లు తీశారు.

అంతకు ముందు.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నారు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌ను కట్టడి చేయడంలో పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యారు. ఓపెనర్లు క్వింటన్‌ డికాక్ (40/ 39 బంతుల్లో 5ఫోర్లు), రోహిత్‌ శర్మ(32/ 25 బంతుల్లో 2ఫోర్లు, 2సిక్సర్లు) రాణించడంతో ముంబై 20 ఓవర్లలో 5 వికెట్లకు 150 పరుగులు చేసింది. చివర్లో హార్డ్‌హిట్టర్‌ కీరన్‌ పొలార్డ్‌ 35 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. దీంతో ముంబై గౌరవప్రదమైన స్కోరు చేయగల్గింది. హైదరాబాద్‌ బౌలర్లలో విజయ్‌ శంకర్‌, ముజీబ్‌ రెహమాన్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.