337 పరుగులకు భారత్ ఆలౌట్.. ఫాలో ఆన్ ఇవ్వని ఇంగ్లండ్..

చెన్నైలో  జరుగుతున్న తొలి టెస్టులో నాలుగో రోజున తన తొలి ఇన్నింగ్స్ లో భారత జట్టు 337 పరుగులకు ఆలౌట్ అయింది. ఇదే సమయంలో ఇండియాను ఫాలో ఆన్ ఆడించే అవకాశం ఉన్నప్పటికీ, ఇంగ్లండ్ జట్టు ఆ దిశగా అడుగులు వేయకుండా, రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేయాలని నిర్ణయించింది.

ఇంగ్లండ్ జట్టు తన తొలి ఇన్నింగ్స్ లో 578 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఫాలో ఆన్ ప్రమాదంలో పడకుండా ఉండాలంటే, భారత జట్టు 378 పరుగులు చేయాల్సివుంది. ఆ స్కోర్ ను భారత జట్టు తాకకున్నా, బౌలర్లు సుదీర్ఘమైన స్పెల్స్ వేసి ఉండటంతో వారికి కొంత విశ్రాంతిని ఇస్తూ, ఇదే సమయంలో వేగంగా మరో 150 పరుగులు జోడించి, ఆపై నేడే ఇండియాను బ్యాటింగ్ కు పిలవాలన్నది ఇంగ్లండ్ ఆలోచనగా తెలుస్తోంది.

ఆటకు మరొక్క రోజు మాత్రమే మిగిలివుండటంతో, ఇండియా విజయం సాధించే అవకాశాలైతే దాదాపు లేనట్టుగానే భావించవచ్చు. ఇదే సమయంలో ఇంగ్లండ్ గెలవాలంటే, సాధ్యమైనంత ఎక్కువ స్కోరును చేసి, భారత జట్టును రేపటిలోగా ఆలౌట్ చేయాలి. ఇదే ప్రస్తుతం ఇంగ్లండ్ ముందున్న లక్ష్యం.

ఇక భారత తొలి ఇన్నింగ్స్ లో రోహిత్ శర్మ 6, శుభమన్ గిల్ 29, ఛటేశ్వర్ పుజారా 73, విరాట్ కోహ్లీ 11, అజింక్య రహానే 1, రిషబ్ పంత్ 91, రవిచంద్రన్ అశ్విన్ 31, షహబాజ్ నదీమ్ 0, ఇషాంత్ శర్మ 4, జస్ ప్రీత్ బుమ్రా 0 పరుగులకు అవుట్ కాగా, వాషింగ్టన్ సుందర్ 85 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో టోమ్ బెస్ కు నాలుగు వికెట్లు లభించగా, జేమ్స్ ఆండర్సన్, జోఫ్రా ఆర్చర్, జాక్ లీచ్ లకు తలో రెండేసి వికెట్ల చొప్పున లభించాయి.

కాగా, తన రెండో ఇన్నింగ్స్ ను ఇంగ్లండ్ ప్రారంభించి, ఒక వికెట్ ను కోల్పోయింది. ఓపెనర్ యామ్ బుర్న్స్ రవిచంద్రన్ అశ్విన్ వేసిన తొలి బాల్ లోనే రహానేకు క్యాచ్ ఇచ్చి డక్కౌట్ గా పెవిలియన్ కు చేరాడు. ఆపై మరో ఓపెనర్ డామ్ సిబ్లీకి తోడుగా డాన్ లారెన్స్ వచ్చి చేరాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ ఒక వికెట్ నష్టానికి పరుగులేవీ చేయలేదు.