అద్భుత పాలన అంటారు.. సమస్య వస్తే స్పందన ఉండదు

• ఆరోగ్యపరమైన ఆపద కలిగినా వైసీపీ పాలకులు పట్టించుకోరు
• కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునేందుకు జనసేన ముందుంటుంది
• జనసేన పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్
• కిడ్నీ వ్యాధిగ్రస్తుడు శ్రీ చందు సాయికుమార్ కి పరామర్శ
• మూత్రపిండాల మార్పిడి చికిత్స నిమిత్తం జనసేన పక్షాన రూ.10 లక్షల సాయం

వాలంటీర్లు.. సచివాలయ వ్యవస్థ ద్వారా అద్భుత పాలన అందిస్తున్నామని చెబుతున్న ఈ ప్రభుత్వం పేద ప్రజలకు సమస్య వచ్చినా స్పందించే పరిస్థితులు లేవని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పష్టం చేశారు. పేదలకు ఆరోగ్యపరమైన ఆపద వచ్చినా వైసీపీ పాలకులు పట్టించుకోవడం లేదన్నారు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునేందుకు ఎప్పుడూ ముందుండే పార్టీ జనసేన మాత్రమేనని పునరుద్ఘాటించారు. శనివారం ఉదయం గుంటూరులోని వేదాంత ఆసుపత్రిలో మూత్రపిండాల సమస్యతో చికిత్స పొందుతున్న తెనాలి నియోజకవర్గం చక్రాయపాలెంకు చెందిన శ్రీ చందు సాయికుమార్ ను పరామర్శించారు. వైద్యులు డా. చింతా రామకృష్ణతో మాట్లాడి సమస్య తీవ్రత, చికిత్స వివరాలు అడిగి తెలుసుకున్నారు. మూత్రపిండాల మార్పిడి చికిత్స నిమిత్తం పార్టీ తరఫున రూ. 10 లక్షల ఆర్ధిక సాయాన్ని అందచేశారు. అతని తల్లిదండ్రులు శ్రీ రామారావు, శ్రీమతి దుర్గ దంపతులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ.. “కొవిడ్ తదనంతర చికిత్స సందర్భంగా శ్రీ సాయికుమార్ కు రెండు మూత్రపిండాలు దెబ్బ తిన్నాయని గుర్తించారు. తెనాలి పర్యటన సందర్భంగా చక్రాయపాలెం వెళ్లినప్పుడు విషయం మా దృష్టికి వచ్చింది. ఆ కుటుంబ దయనీయ స్థితి చూసి జనసేన పార్టీ తరఫున అండగా నిలబడాలని నిర్ణయించాము. సమస్యను శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్లగా ఆదుకుందామని భరోసా ఇచ్చారు. శ్రీ సాయి కుమార్ తల్లి కిడ్నీ ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. వేదాంత ఆసుపత్రి వైద్యులు సానుకూలంగా స్పందించారు. ఈ రోజున మూత్రపిండాల మార్పిడి చికిత్స నిమిత్తం రూ.10 లక్షల ఆర్ధిక సాయాన్ని జనసేన పార్టీ అందించింది. తమ పాలనలో అంతా అద్భుతంగా ఉందని చెబుతున్న ప్రభుత్వం నిరుపేద, కూలి పనులు చేసుకునే కుటుంబానికి కష్టం వస్తే కాపాడుకునే పరిస్థితి లేదు. కనీస స్పందన లేదు. రాజకీయ పార్టీగా ఓ సమస్య మా దృష్టికి వచ్చినప్పుడు మా వంతు చేయగలిగిన సాయం చేస్తున్నాం. ఆ కుటుంబంలో ధైర్యం నింపడంతో పాటు మీ వెంట మేమున్నామని చెప్పేందుకే పార్టీ వారికి అండగా నిలిచింది. పేద ప్రజలకు అండగా నిలిచేందుకు జనసేన పార్టీ ముందుంటుంద”ని అన్నారు. వేదాంత ఆసుపత్రి వైద్యులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, కార్యక్రమాల నిర్వహణ విభాగం కన్వీనర్ శ్రీ కళ్యాణం శివశ్రీనివాస్, గుంటూరు నగర అధ్యక్షులు నేరెళ్ల సురేష్, రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ జిలానీ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బండారు రవికాంత్, పార్టీ నాయకులు ఆళ్ల హరి, దివ్వెల హరిబాబు, ఎర్రు వెంకయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు.