సమగ్ర అధ్యయనం తర్వాతే పొత్తులపై నిర్ణయం

• నిస్వార్ధంగా కష్టపడితే అధికారం దానంతటదే వస్తుంది
• వైసీపీ అరాచక పాలనతో 70 శాతం ప్రజలు విసిగిపోయారు
• రాష్ట్రానికి స్థిరత్వం తీసుకురావడమే జనసేన లక్ష్యం
• వారాహి విజయ యాత్ర సాగిన నియోజకవర్గాల ఇంఛార్జులు, పరిశీలకుల సమావేశంలో పవన్ కళ్యాణ్

పొత్తుల గురించి ఆలోచించేందుకు సమయం ఉంది.. ఒంటరిగా వెళ్లాలా, కలసి వెళ్లాలా అనేది తరవాత మాట్లాడుకునే విషయమని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. మండల స్థాయిలో సమగ్ర అధ్యయనం తర్వాతే పొత్తులపై నిర్ణయం తీసుకుంటామన్నారు. మనం బలంగా పని చేస్తే అధికారం దానంతట అదే వచ్చి తీరుతుందని… నాయకులు అందుకు అనుగుణంగా అడుగులు వేయాలని దిశానిర్దేశం చేశారు. ఆదివారం నుంచి ప్రారంభం కాబోయే వారాహి విజయ యాత్ర మలి దశకు ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందించాలని కోరారు. తొలి దశ వారాహి విజయ యాత్రకు సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో వారాహి విజయ యాత్ర సాగిన నియోజకవర్గాల ఇంఛార్జులు, పరిశీలకులతో శనివారం సాయంత్రం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ… “జనసేన పార్టీ ప్రజల్లోకి బలంగా వెళ్తోంది. ఎలాంటి సమస్యపై మనం మాట్లాడినా అది ప్రజల్లోకి చేరిపోతోంది. పార్టీ ప్రజల్లోనే ఉంది. ఉభయ గోదావరి జిల్లాల్లో అది మరింత బలంగా ఉంది. యాత్రకు జనం వస్తున్నారు నాయకత్వం దాన్ని అందిపుచ్చుకోవాలి. వారాహి విజయ యాత్ర విజయం తాలూకు పునాదులను ఆసరాగా చేసుకుని ముందుకు వెళ్లాలి.
• రూల్ ఆఫ్ లాను వైసీపీ విస్మరించింది
ఆంధ్రప్రదేశ్ లో రూల్ ఆఫ్ లా నాశనం అయిపోయింది. ఏ పార్టీ అయినా రూల్ ఆఫ్ లాకి కట్టుబడి పని చేయాలి. వైసీపీ దాన్ని పూర్తిగా విస్మరించింది. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అనే అంశాన్ని అవివేకంతో మాట్లాడడం లేదు. శ్రీ జగన్ రెడ్డి, వైసీపీ నాయకులు వెళ్లే మార్గం తప్పు. వైసీపీ పాలనలో అవినీతి తారా స్థాయికి చేరిపోయింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లో మనం రోడ్ల మీదకు రావాల్సి వచ్చింది. వైసీపీని ఎన్నుకున్న వారం రోజుల్లోనే ప్రజలకు చేసిన తప్పు అర్ధం అయిపోయింది. కొంత మందికి ఒక్క రోజులోనే అర్ధం అయిపోయింది. ఇప్పుడు 70 శాతం ప్రజలకు తెలిసిపోయింది. రాష్ట్రంలో గంజాయి విక్రయాలు పెరిగిపోయాయి. 30 వేల మంది అమ్మాయిలు మిస్సయ్యారు. ఈ అంశం మీద కనీసం రివ్యూ చేసే పరిస్థితులు లేవు. ఇది చాలా పెద్ద సమస్య. అయినా ఈ అంశం మీద కనీసం ఎవరూ మాట్లాడరు. ఇలాంటి పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోలేకపోతే రాష్ట్రం అథోగతిపాలవుతుంది. రాష్ట్రానికి స్థిరత్వం తీసుకురావడమే వచ్చే ఎన్నికల తాలూకు ముఖ్య ఉద్దేశం” అని అన్నారు.
* వైసీపీ నాయకుల అవినీతి తారా స్థాయికి చేరింది : నాదెండ్ల మనోహర్
పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో వారాహి యాత్రకు విశేష స్పందన లభించింది. ముఖ్యంగా యువత, మహిళలు ప్రతి అడుగులో బ్రహ్మరథం పట్టారు. నియోజకవర్గాలవారీగా బాధ్యతలు స్వీకరించి ఈ కార్యక్రమ విజయానికి కృషి చేసిన ఇంఛార్జులను అభినందిస్తున్నాం. యాత్రలో భాగంగా ఏర్పాటు చేసిన ముఖాముఖి సమావేశాల్లో వివిధ వర్గాల నుంచి స్థానిక సమస్యలపై లోతుగా అధ్యయనం చేయగలిగాం. జనవాణి కార్యక్రమంలోనూ సమస్యలతో పాటు స్థానికంగా జరుగుతున్న దౌర్జన్యాలు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వచ్చాయి. వైసీపీ ప్రజా ప్రతినిధుల దౌర్జన్యాలు మామూలుగా లేవు. అవినీతి విపరీతంగా పెరిగిపోయింది. ప్రతి నియోజకవర్గంలో జనసేన పార్టీ మీ వెంట ఉంటుందన్న ధైర్యాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. ఆ స్ఫూర్తిని స్థానిక నాయకత్వం కొనసాగించాలి. క్షేత్ర స్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్లాలి. మీడియా కథనాల ఆధారంగా ఓటరు జాబితాలో చాలా అవకతవకలు చోటు చేసుకున్నట్టు అర్ధమవుతోంది. స్థానిక నాయకత్వం బూత్ లెవల్ ఆఫీసర్ నుంచి ఓటరు లిస్టు తీసుకుని చెక్ చేసుకోండి. వ్యవస్థల్ని దుర్వినియోగం చేసి లబ్దిపొందాలని ప్రభుత్వంలో ఉన్న వారు చూస్తున్నారు. ప్రజలకు సమస్య వచ్చినప్పుడు జనసేన నాయకులు అండగా నిలిచారన్న భావన ప్రజల్లో కలిగించాలి. ప్రతి ఓటరుతో సంబంధాలు కొనసాగించాలి. మూడు వారాల ప్రచారంతో గెలిచేస్తామనుకోవద్దు. నియోజకవర్గాల వారీగా సమస్యలు మారిపోతున్నాయి. అవసరం అయితే లబ్దిదారులను వెంటపెట్టుకుని స్పందన కార్యక్రమానికివెళ్లండి. మీరు ప్రజల పక్షాన నిలిస్తే వారు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ప్రజలు సత్వర న్యాయం కోసం సమస్యలు నేరుగా శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువస్తున్నారు. వారాహి విజయ యాత్ర విజయానికి ఎంతో మంది కృషి చేశారు. ఆ శ్రమను వృధా కానీయొద్దు” అన్నారు. ఈ సమావేశంలో పార్టీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, పీఏసీ సభ్యులు ముత్తా శశిధర్, పితాని బాలకృష్ణ, ప్రధాన కార్యదర్శులు బొలిశెట్టి సత్య, చిలకం మధుసూదన్ రెడ్డి, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.