బేబీ నాయన పాదయాత్రని అడ్డుకోవడం దురదృష్టకరం: గురాన అయ్యలు

విజయనగరం: బొబ్బిలి నియోజకవర్గం టీడీపీ ఇన్‌ఛార్జి బేబి నాయనను ముందస్తుగా అరెస్టు చేసి పాదయాత్రని అడ్డుకోవడాన్ని జనసేన పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని జనసేన నాయకులు గురాన అయ్యలు అన్నారు. ఈమేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. చంద్రబాబునాయుడుకు వైసీపీ ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగా పెడుతున్న ఇబ్బందుల నుంచి విముక్తి లభించాలని కోరుకుంటూ.. బొబ్బిలి నుంచి సింహాచలం దేవస్థానం వరకూ బేబీనాయన పాద యాత్ర వెళ్ళడానికి పోలీసులకు ఒక అర్జి పెట్టుకోవడం జరిగిందని తెలిపారు. ఆ పాదయాత్ర మొక్కును తీర్చుకోకుండా ముందస్తుగా అరెస్టు చేయడాన్ని పోలీసుల దుశ్చర్యగా భావిస్తున్నామన్నారు. ఎక్కువమంది వెళ్ళడానికి అనుమతి ఇవ్వడానికి ఇబ్బంది అయితే ఒక్కడినైనా నడిచి వెళతానని బేబినాయన చెప్పినా అనుమతి ఇవ్వకపోవడం బాధకరమన్నారు. ఆయనను ఆపే అధికారం పోలీసులకు ఎవరిచ్చారని జనసేన పార్టీ తరపున ప్రశ్నిస్తున్నామన్నారు. 144 సెక్షన్‌, సెక్షన్‌ 30 అమలులో వుంటే జగన్మోహన్‌రెడ్డి జిల్లా పర్యటన సందర్భంగా వైకాపా బైక్‌ ర్యాలీకి ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. వైసీపీ వారికి ఒక న్యాయం, వేరేవారికి మరో న్యాయమా అని నిలదీశారు. రాష్ట్రంలో జగన్మోహన్‌రెడ్డి సైకోలా వ్యవహరిస్తూ నియంత పాలన చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రమంతటా నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్న సమయంలో 144 సెక్షన్‌, సెక్షన్‌ 30 విధించడం దారుణమన్నారు. వేరే మతానికి చెందిన జగన్మోహన్‌రెడ్డికైతే గణేష నవరాత్రులంటే ఏమిటో తెలియదని, ఈ సమయంలో 144 సెక్షన్‌, సెక్షన్‌ 30 విధించకూడదని జగన్మోన్‌రెడ్డికి సూచించాలనే ఇంగిత జ్ఞానం ఆ పార్టీ నేతలకు లేకపోవడం విచారకరమన్నారు. బేబి నాయన అరెస్టును తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, ఆయనను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. వైసీపీ రాక్షస పాలనను అంతం చేయడానికి జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ ఒక అడుగు ముందుకేసి చక్కటి నిర్ణయం తీసుకున్నారన్నారు. పవన్‌ కళ్యాణ్‌ నిర్ణయంపై ప్రజలందరూ హర్షం వ్యక్తం చేశారన్నారు. వైకాపా ప్రభుత్వానికి నూకలు చెల్లే రోజులు దగ్గరపడ్డాయని, త్వరలోనే ప్రజా పాలన వస్తుందని వ్యాఖ్యానించారు.