జేపీ నడ్డాతో భేటీ అయిన ఈటల రాజేందర్

తెలంగాణ మాజీ మంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నేత ఈటల రాజేందర్ బీజేపీలో చేరడం ఖాయమయింది. ఢిల్లీకి వెళ్లిన ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి ఈటలతో పాటు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ ఎంపీ వివేక్, తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జి తరుణ్ ఛుగ్ తదితరులు హాజరయ్యారు. ఢిల్లీ నుంచి హుజూరాబాద్ చేరుకున్న తర్వాత తన అనుచరులతో ఈటల భేటీ కానున్నారు. అనంతరం బీజేపీలో చేరే విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారు.

ఎమ్మెల్యే పదవితో పాటు, టీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి కూడా ఈటల రాజీనామా చేయబోతున్నారు. ఐదారు రోజుల్లో ఆయన బీజేపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. ఈటల ఢిల్లీ పర్యటన తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మారుతున్న రాజకీయ పరిణామాలను టీఆర్ఎస్ పార్టీ కూడా నిశితంగా గమనిస్తోంది. ఈటల బీజేపీలో చేరిన తర్వాత తెలంగాణ రాజకీయాలు ఎలాంటి మలుపులు తిరగనున్నాయో అని ప్రజలు చర్చించుకుంటున్నారు.