విదేశాలకు వెళ్లే విద్యార్థులకు వ్యాక్సిన్ వేయండి: జగన్

ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు కరోనా వ్యాక్సిన్ వేయించాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఈరోజు ఆయన తన క్యాంప్ కార్యాలయంలో కరోనా నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్ క్యాంప్ పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

విద్యార్థులతో పాటు, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లేవారికి కూడా వ్యాక్సిన్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. వ్యాక్సిన్ ఇచ్చినట్టు వారికి ప్రభుత్వం సర్టిఫికెట్ కూడా ఇవ్వాలని అధికారులకు సూచించారు. మరోవైపు కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన 92 మంది పిల్లలను వైసీపీ ప్రభుత్వం గుర్తించింది. వీరిలో 43 మందికి రూ. 10 లక్షల చొప్పున ప్రభుత్వం డిపాజిట్ చేసింది. ఈ మొత్తాన్ని సరైన పథకాల్లో పొదుపు చేయాలని, నెలనెలా వారి మెయింటెనెన్స్ కోసం వడ్డీ వచ్చేలా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.