హైకోర్టులో ఇంకొ షాక్ తిన్న జగన్ సర్కారు.. ఇళ్ల పట్టాలపై కీలక తీర్పు

ఏపీ హైకోర్టు వైసీపీ ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీకి సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యా సంస్థల భూములను ఇళ్ల స్థలాలకు కేటాయించడాన్ని రాష్ట్ర హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. విశాఖపట్నం జిల్లా అనంతగిరి మండలంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ భూములను ఇళ్ల పట్టాలకు కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిని వ్యతిరేకిస్తూ న్యాయవాది యోగేష్‌ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టివేసింది.

ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలకు సంబంధించిన స్థలాల్లో ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి వీల్లేదని హైకోర్టు మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వైసీపీ సర్కార్‌కు మరో పెద్ద షాక్ తగిలినట్టయింది. తదుపరి విచారణ 8 వారాలకు వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. అలాగే ఈ కేసుకు సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.