రాష్ట్ర విభజన సమయంలోనే కుట్ర చేసిన జగన్

• విడతల వారీగా రాజీనామాలతో అభివృద్ధి జరగకుండా కుతంత్రం
• పేటీఎం కుట్రలను జన సైనికులు బలంగా తిప్పికొట్టాలి
• వైసీపీ పాలనతో రాష్ట్రంలో విపరీతంగా వలసలు పెరిగాయి
• ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన లేని వ్యక్తి జగన్
• జనసేన విస్తృత స్థాయి సమావేశంలో పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్

‘రాష్ట్రంలో ఎప్పుడూ అలజడులు జరగాలి… అశాంతితో ప్రజలు ఉండాలన్నదే జగన్ లక్ష్యం. అతడికి ఎల్లపుడూ అధికారం కోసం చేసే కుట్రలు, ఆలోచనలు మాత్రమే ఉంటాయి. ప్రజలకు మేలు చేయాలనే దృష్టి లేని నాయకుడు జగన్. 2014లో రాష్ట్ర విభజన సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీని చీల్చి, శాసనసభ్యులతో విడతలవారీగా రాజీనామాలు చేయించి, అభివృద్ధిని అడ్డుకోవాలని జగన్ చూశాడ’ని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ అన్నారు. జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం శనివారం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో ప్రారంభోపన్యాసం చేసిన శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ ‘ప్రజల కోసం పని చేసేదే ప్రజాస్వామ్యం. అనేక సందర్భాల్లో ప్రజలు కష్టాల్లో ఉన్నపుడు నిజాయతీగా స్పందించే నాయకుడు ఉండాలి. ప్రజలు సైతం ప్రభుత్వంలో పాలుపంచుకోవాలి. అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. అందుకు భిన్నమైన పరిస్థితి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. గత నాలుగున్నర ఏళ్లలో ప్రజలు ఎదుర్కొంటున్న వెతలు వర్ణనాతీతం. మన ప్రాంత, బిడ్డల భవిష్యత్తు కోసం ప్రజలకు మేలు జరగాలి అని నిజమైన నాయకులు తపనపడతారు. ఈ ముఖ్యమంత్రి మాత్రం ఎప్పుడూ రాజకీయాలతో ముడిపెట్టి, అందరినీ ఇబ్బందిపెట్టాలని చూస్తున్నారు. 151 స్థానాలు అందించిన వైసీపీకి రాష్ట్ర సంక్షేమం పట్టలేదు. జనసేన పార్టీ ప్రస్థానం సుస్థిరమైన అభివృద్ధి కోసం, కొత్త విధానంతో, ఏ పార్టీ చేయని విధంగా ప్రజలకు మేలు చేసేవిగా ఉంటాయి. అంచెలంచెలుగా జనసేనలో నా ప్రయాణం శ్రీ పవన్ కళ్యాణ్ గారితో 5 సంవత్సరాలు పూర్తయింది. విలువలతో కూడిన రాజకీయాలు చేయడం ఎలా అనేది శ్రీ పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకున్నాను.
• ప్రశ్నించే ధైర్యం ఇచ్చారు
మన బిడ్డలు వేరే ప్రాంతానికి వెళ్లి బాధపడుతున్నారు.. యువతకు ఎందుకు భవిష్యత్తు ఇవ్వలేకపోతున్నామని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎల్లవేళలా ఆలోచన చేస్తుంటారు. అలాంటి మన అధ్యక్షుల వారు ఈ ప్రస్థానంలో ఎన్నో మాటలుపడ్డారు. అవమానాలు ఎదుర్కొన్నారు. దేనికి వెరవకుండా మనలో ధైర్యం నింపారు. ప్రజాస్వామ్యయుతంగా ఎలా పోరాడాలో చక్కగా మనకు నేర్పించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే ధైర్యం ఇచ్చారు. ఈ వైసీపీ దాష్టీకాలపై సామాన్యుడు పడుతున్న బాధలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి తరుణంలో కేవలం ప్రశ్నించడమే కాకుండా, చైతన్యం నింపే విధంగా కార్యకర్తలను సిద్ధం చేసిన యోధుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ధర్మో రక్షతి రక్షిత: అంటారు. ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మన వెంటే ఉంటుందన్న నమ్మకాన్ని సూత్రాన్ని నమ్మిన నేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఓ పార్టీని ముందుకు నడపడానికి ఆయన పడే కష్టం నాకు తెలుసు. పార్టీ ప్రస్థానంలో ఆయన వేసిన ప్రతి అడుగు ఓ మైలురాయి. ఆయన స్ఫూర్తితో జనసైనికులు, వీర మహిళలు చూపిన తెగువ అద్భుతం.
• 2014లోనే జగన్ బీజం వేశాడు
రాష్ట్ర విభజన జరుగుతున్నపుడు నేను శాసనసభ స్పీకర్ గా ఉన్నాను. ఆ సమయంలో కేంద్రం నుంచి రాష్ట్ర విభజన ప్రక్రియ ప్రారంభం అయిందనే సమాచారం వచ్చిన దగ్గర నుంచి విభజన సమయంలో ప్రతి చర్చలో పాల్గొనే అవకాశం వచ్చింది. 292 అసెంబ్లీ సీట్లు, 42 లోక్ సభ స్థానాలు కలిగిన ఆంధ్రప్రదేశ్ చీలిపోతుంటే ఎంతో వేదన అనుభవించాం. ఇందుకు సంబంధించిన విషయాలపై నేను, పవన్ కళ్యాణ్ గారు పలుమార్లు చర్చించుకొని బాధపడ్డాం. అలాంటి విపత్కర స్థితిలో జగన్ రాష్ట్రం గురించి ఆలోచన చేయకుండా కాంగ్రెస్ పార్టీలో చీలిక తెచ్చి జగన్ 25 మంది చేత విడతల వారీగా రాజీనామాలు చేయించారు. దఫాదఫాలుగా ఎన్నికలు వచ్చేలా చేస్తే అభివృద్ధి పనులు ఆగిపోతాయనే కుట్రపూరితంగా ఆలోచన చేశాడు. విడతల వారీగా ఉప ఎన్నికలు జరగాలనే తలంపుతో ఎలక్షన్ కోడ్ వల్ల రాష్ట్ర అభివృద్ధి జరగకుండా జగన్ అప్పట్లో పన్నాగం పన్నారు.
• జగన్… ఎప్పుడైనా ఒక్క రూపాయి దానం చేశావా?
గత ఎన్నికల్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల ఓడిపోయారు. అయినా ఎక్కడా తగ్గకుండా రాజకీయాల్లో ముందుకు వెళ్లారు. ఓటమి తర్వాత కూడా మీడియాతో మాట్లాడుతూ వైసీపీకి ప్రజలు ఇచ్చిన తీర్పునకు కట్టుబడి, ప్రజలకు మరింత మంచి కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. కొత్త ప్రభుత్వానికి కచ్చితంగా సమయం ఇవ్వాలనే తలంపుతో ఏడాది సమయం ఇవ్వాలని అనుకున్నాం. అయితే వైసీపీ తీసుకొచ్చిన ఇసుక విధానం వల్ల భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారు. జనసేన ఆధ్వర్యంలో వెంటనే స్పందించి విశాఖలో వారికి అండగా లాంగ్ మార్చ్ చేశాం. శ్రీమతి డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో 5 రోజుల పాటు భవవ నిర్మాణ కార్మికులకు అండగా నిలిచి కడుపు నింపాం. కష్టకాలంలో ఉన్నవారి కోసం నిలబడటమే జనసేన సిద్ధాంతం. దేశంలో ఏ రాజకీయ నాయకుడు కూడా ఇప్పటి వరకు ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు సొంత డబ్బును ఇచ్చిన వారు లేరు. లక్ష కోట్ల రూపాయలు దాచుకున్న జగన్ ఏ నాడు ఒక్క రూపాయి దానం చేసిన పాపాన పోలేదు. కౌలు రైతులు కళ్లెదుటే బలవన్మరణాలకు పాల్పడుతుంటే ముందుకొచ్చి రూ.5 కోట్లతో నిధిని ఏర్పాటు చేసిన గొప్ప మానవతా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. క్లాస్ వార్ గురించి చెబుతున్న ముఖ్యమంత్రి ఏనాడు అయినా ఓ పేద కుటుంబాన్ని అయినా ఆదుకున్నారా..? జనసేన నిర్వహించిన జనవాణి తర్వాత ముఖ్యమంత్రి మీడియాలో హడావుడి కోసం ముఖ్యమంత్రి సంక్షేమ నిధి నుంచి రూ.50 వేలు, రూ.లక్ష ఇస్తూ పెద్ద దానం చేసినట్లు చూపిస్తున్నారు. రోడ్ల విషయంలోనూ జనసేన చేసిన డిజిటల్ క్యాంపైన్ వల్ల రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిని ప్రపంచానికి తెలియజేశాం. దేశంలోనే ఆశ్చర్యపోయేలా రాష్ట్రంలోని అత్యంత అధ్వానంగా ఉన్న రోడ్ల పరిస్థితిని తెలియజేశాం. తుపాను వల్ల నష్టపోయిన రైతాంగానికి రూ.25 వేల సాయం అందించాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యక్షంగా రైతులను కలిసి కోరినా ప్రభుత్వంలో స్పందన లేదు. ఆంధ్రప్రదేశ్ లో 974 కిలోమీటర్ల కోస్తా తీరం ఉన్నా అభివృద్ధి జాడ లేదు. ముఖ్యమంత్రి అయ్యాక ఒక్క కంపెనీ జగన్ తీసుకురాలేకపోయాడు. వైసీపీ వచ్చిన తర్వాత రాష్ట్రం నుంచి పారిశ్రామికవేత్తలను బయటకు పంపారు.
• అక్రమ నిర్బంధాలు.. అరెస్టులు చేశారు
గత ఏడాది జనవాణి కోసం విశాఖపట్నం వెళ్లినపుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని వ్యవస్థలను ఉపయోగించుకొని అధికారులు ఎంతగా ఇబ్బందిపెట్టారో ప్రజలకు తెలుసు. ఏ దేశంలో ఉన్నామో అర్ధం కాని భావన వచ్చింది. ఆ సమయంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కాపాడుకోవడం కోసం జనసైనికులు, వీర మహిళలు హోటల్ వద్ద కాపలాగా ఉన్న తీరు మహోన్నతమైన ఘటన. విశాఖలో వేల ఎకరాల భూదందాలు సాగిన తీరు… వాటి కాగితాలను సామాన్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి వద్దకు తీసుకొస్తారని భయంతో మూడు రోజులు హోటల్లో అక్రమంగా నిర్బధించారు. ఆ గొడవలో అక్రమ అరెస్టులు చేయడమే కాకుండా, పైశాచికానందంతో జనసేన నాయకుల మీద 307 సెక్షన్ కేసులు పెట్టడం దారుణం. పై నుంచి వచ్చిన ఆదేశాలను పోలీసులు అమలు చేస్తూ వత్తాసు పలుకుతున్నారు తప్పితే, మానవ హక్కులు, రాజ్యాంగ హక్కులను కాపాడలేకపోతున్నారు. దీనిపై పోలీసులు ఆలోచించాలి. ఎందుకు మీరు అంత భయపడుతున్నారో మీ మనస్సాక్షిని ప్రశ్నించుకోండి.
• బైజూస్ లో లెక్కలేనన్ని అక్రమాలు
క్షేత్రస్థాయిలో వాలంటీర్ల వ్యవస్థ ద్వారా జరుగుతున్న విషయాల గురించి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినపుడు చాలామంది భయపడ్డారు. ఇలా ఎలా మాట్లాడతారు అని అన్నారు. అయితే నిజం మాట్లాడేందుకు భయం ఎందుకు అని శ్రీ పవన్ కళ్యాణ్ గారు అంటారు. ఇటీవల విద్యావ్యవస్థ గురించి నేను మాట్లాడినపుడు కూడా ఎన్నో విషయాలు వెలుగులోకి వచ్చాయి. బైజూస్ లో లెక్కలేనన్ని అక్రమాలు జరిగాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 2021-22 విద్యా సంవత్సరంలో 3.89 లక్షల మంది విద్యార్థులు డ్రాప్ అవుట్ అయ్యారు. 2.29 లక్షల మంది పిల్లలు ఆచూకీ లేకుండా పోయారు.
• అన్నపూర్ణ లాంటి తూ.గో.జిల్లా నుంచి వేల కుటుంబాల వలస
అలాగే వాలంటీర్ల ద్వారా చేసిన సర్వేలో రాష్ట్రంలో గత నాలుగేళ్లలో 3.17 లక్షల కుటుంబాలు రాష్ట్రం వదిలేసి పక్క రాష్ట్రాలకు వలస వెళ్లిపోయారు. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 55 వేల కుటుంబాలు వలస వెళ్లిపోయాయి. అన్నపూర్ణ లాంటి తూర్పుగోదావరి జిల్లా నుంచి 46,285 కుటుంబాలు వలసలు వెళ్లిపోయాయి. సీఎం సొంత జిల్లా కడప నుంచి 21 వేల కుటుంబాలు వలసలు వెళ్లిపోయాయంటే ఈ ముఖ్యమంత్రి పాలన ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. సొంత నియోజకవర్గం పులివెందులలో 24 మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ. గత ప్రభుత్వంలో తప్పులు ఉంటే సమీక్ష చేయండి. మంచివి అయితే కొనసాగించాలి. అలాకాకుండా కావాలని కక్షగట్టి, వారిని ఎలా అయినా ఇబ్బందిపెట్టాలనే కసితో పనిచేయడం దారుణం. శ్రీ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం గురించి అభివృద్ధిపై ఏ దేశం వెళ్లినా కచ్చితంగా మాట్లాడతారు. ఇక్కడ వ్యక్తులు గురించి కాదు.. వ్యవస్థ గురించి మాట్లాడాలి. అలాంటి వారి మీద కక్ష కట్టి వైసీపీ నాయకుడు అరెస్టు చేయించారు. ఇది నిజంగా పైశాచిక పాలన కాదా..? ఇటీవల శ్రీ పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి కేంద్ర కార్యాలయానికి రావాలనుకున్న సమయంలో ఏకంగా విమానం దిగకుండా గన్నవరం విమానాశ్రయ అధికారులకు పోలీసు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారిని రిసీవ్ చేసుకునేందుకు వెళ్లిన నన్ను కూడా విమానాశ్రయంలోకి రాకుండా అడ్డుకున్నారు. గట్టిగా అడిగితేనే నన్ను లోపలికి పంపారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి విమానం ల్యాండ్ కాకుండా చేయడం ఈ ప్రభుత్వ కక్షపూరిత వైఖరికి పరాకాష్ట. శ్రీ పవన్ కళ్యాణ్ గారు విజయవాడకు వస్తే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని చెప్పడం అత్యంత దారుణం. ఎలాంటి గొడవలు లేకుండా, పోలీసుశాఖను గౌరవిస్తూ జనసేన ఏ కార్యక్రమం అయినా నిర్వహిస్తుంది. క్రమశిక్షణతో వ్యవస్థలకు పూర్తిగా సహకరిస్తాం. ఈ వైసీపీ పాలనలోని ఓ పోలీసు అధికారి విమానం ల్యాండ్ కాకుండా చేయడం దుర్మార్గం. శ్రీ పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మార్గం ద్వారా రావాలని భావించడంతో తెలంగాణ సరిహద్దు వద్ద మరోసారి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని రిసీవ్ చేసుకుందామని వెళ్లాం. అక్కడ కూడా పోలీసులు చుట్టుముట్టి, శ్రీ పవన్ కళ్యాణ్ గారు వెనక్కు వెళ్లిపోవాలని చెప్పారు. అలాకాకుంటే అరెస్టు చేస్తామని చెప్పారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు అప్పుడు కూడా ఒకటే మాట అన్నారు. మన రాష్ట్రంలోకి మనం అడుగుపెడితే ఎందుకు అరెస్టు చేస్తారు.. అవసరం అయితే నడుచుకుంటూ వెళ్దాం అన్నారు. 4 గంటల పాటు సామాన్యులను ఇబ్బంది పెట్టేలా పోలీసులు వ్యవహరించారు. ఆ సమయంలో జనసైనికులు, వీర మహిళలు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని తీసుకెళ్తున్న జీపును అడ్డుకున్న తీరు మన పార్టీ ఐక్యతను మరోసారి చాటి చెప్పింది. అక్రమంగా నాయకుడ్ని అరెస్టు చేస్తే ఊరుకోబోమని మహిళలు అర్ధరాత్రి రోడ్డు మీద చేసిన నిరసన అద్భుతం. భారతదేశం గర్వపడే విధంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు జీ-20 సదస్సును నిర్వహించారు. అంతర్జాతీయ నాయకులను ఆహ్వానించి మరీ అద్భుతంగా సదస్సును నిర్వహిస్తే అక్కడ ఏం జరిగిందో కూడా రాష్ట్ర ప్రజలకు తెలియకుండా వైసీపీ ప్రభుత్వం చేయగలిగింది.
• 27.51 లక్షల ఓట్లను తీసేశారు
సరైన రోడ్లు, తాగునీరు లేదు.. కరెంటు బిల్లులు సామాన్యులు భరించలేనంతగా వస్తున్నాయి. అడిగితే కేసులు పెడుతున్నారు. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా అరాచకం సృష్టించాలని చూస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా రాష్ట్రంలో 27.51 లక్షల ఓట్లు అనుమానంగా ఉన్నాయని ప్రకటించడం చూస్తే, వాలంటీర్లతో ఎంతటి దారుణాలు చేస్తున్నారో అర్ధం అవుతుంది. ఈ కక్షపూరిత ముఖ్యమంత్రిని ఏ విధంగా ఎదుర్కోవాలో అలా మనల్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారు సిద్ధం చేశారు. సంక్షోభం నుంచే నిజమైన నాయకత్వం పుట్టుకొస్తుంది. రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉన్న శ్రీ చంద్రబాబు గారిని శ్రీ పవన్ కళ్యాణ్ గారు కలిసి ఓ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. భారతీయ జనతా పార్టీ నాయకులు సైతం రాష్ట్రంలో జరుగుతున్న దమనకాండను, రాజ్యాంగ విరుద్ధంగా చేస్తున్న పనులను దృష్టిలో ఉంచుకొని కలిసి వస్తారని భావిస్తున్నాం. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం అంతా కలిసి సమష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉంది.
• పేటీఎం బ్యాచ్ విష ప్రచారాలను బలంగా తిప్పికొడదాం
పేటీఎం బ్యాచ్ 2019 ఎన్నికల్లో మనపై ఎంతటి దుష్ప్రచారం చేశారో మనకు తెలుసు. 175 స్థానాల్లో మనం నిలబడాలి అనుకున్నపుడు ఇష్టానుసారం ప్రచారం చేశారు. మళ్లీ ఈ పేటీఎం బ్యాచ్ విష ప్రచారానికి తెర తీసింది. ఈసారి మనం ఆ ప్రచారాన్ని బలంగా ఎదుర్కోవాలి. అప్పుడే తప్పుడు ప్రచారాలు చేస్తూ నా సంతకంతో లెటర్ హెడ్ లు ప్రచారం చేస్తున్నారు. దీనిపై జనసైనికులు, వీర మహిళలు జాగురతతో వ్యవహరించాలి. శ్రీ పవన్ కళ్యాణ్ గారు మనందరిలో నూరిపోసిన ధైర్యం, పోరాడే తత్వం ఇప్పుడు మనకు కవచంగా పని చేయాలి. పేటీఎం బ్యాచ్ ప్రచారాల్లో మనం పడిపోకుండా, వారి తీరును బలంగా తిప్పి కొట్టాలి. శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాన్ని, ఆయన భవిష్యత్తు లక్ష్యాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్దాం. 2024లో గెలిచేది మనం… ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది మనమే. జనసేన, తెలుగుదేశం, బీజేపీల ప్రభుత్వంలో కచ్చితంగా ప్రజలకు అద్భుతమైన పాలన తెచ్చేవిగా ఉంటాయి. తెలంగాణ మిత్రులు సైతం ఎలాంటి భయం లేకుండా పోరాడండి. అక్కడ కూడా మన పార్టీ బలంగా ఎదగాలి. ధర్మం కోసం చేసే పోరాటంలో ప్రతి ఒక్కరూ నిలబడండి’’ అన్నారు.