జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆమోదం పొందిన తీర్మానాలు

* తీర్మానం 1
రాజమండ్రిలో 14వ తేదీన మన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రకటన… అంతకు ముందు, తరవాత ఉన్న పరిణామాలను ప్రతి ఒక్కరూ పరిశీలించారు. మాజీ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేసినప్పుడు రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని విశాల దృక్పథంతో స్పందించారు. ఆ క్రమంలోనే కేంద్ర కారాగారానికి వెళ్ళి శ్రీ చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించి.. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ అవసరమని శ్రీ పవన్ కళ్యాణ్ గారు భావించారు. అందుకు అనుగుణంగానే రాబోయే ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం కలసి పని చేస్తాయని విస్పష్టమైన ప్రకటన చేశారు. ఈ నిర్ణయం- రాష్ట్ర భవిష్యత్, అభివృద్ధి, యువతకు మేలు చేయాలనే సంకల్పంతో అరాచక వైసీపీని నిలువరించేందుకు, మన రాష్ట్రాన్ని, ప్రజలను రక్షించుకోవడానికి తీసుకున్నదని ఈ విస్తృత స్థాయి సమావేశం భావిస్తోంది. మన అధ్యక్షులు తీసుకున్న సమున్నత నిర్ణయాన్ని జనసేన విస్తృత స్థాయి సమావేశం స్వాగతిస్తూ మనస్ఫూర్తిగా ఆమోదం తెలియచేస్తోంది. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజాహితం కోసం అనునిత్యం ఆలోచించే శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా అందుకు అనుగుణంగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్తామని ఈ సమావేశం తెలియచేస్తోంది. రాబోయే ఎన్నికల్లో జనసేన, టీడీపీ కలసి చేసే వైసీపీ విముక్త ఆంధ్రపదేశ్ అనే ప్రజా పోరాటంలో బీజేపీ కలసి వస్తుందని ఆశిస్తున్నాం. రాజకీయ ప్రక్రియలో క్రమశిక్షణతో కలసి పని చేస్తూ మన పార్టీ బలోపేతానికి కృషి చేద్దాం. మన లక్ష్యాన్ని సాకారం చేసే ప్రజాస్వామ్య పోరాటంలో మీ వెన్నంటి ఉండి ముందుకు వెళ్తామని, రాష్ట్ర ప్రయోజనం కోసం మీరు తీసుకొనే ప్రతి రాజకీయ నిర్ణయాన్ని సానుకూల దృక్పథంతో స్వీకరిస్తామని పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి తెలియచేసుకొంటున్నాం.
* తీర్మానం 2

భారత దేశ ప్రతిష్ట అంతర్జాతీయంగా మరింత ఇనుమడింప చేసే విధంగా మన గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు జి20 సదస్సును అద్భుతరీతిలో విజయవంతంగా నిర్వహించారు. ఒకే భూమి.. ఒకే కుటుంబం.. ఒకే భవిష్యత్తు..(ONE EARTH.. ONE FAMILY.. ONE FUTURE..) అనే గొప్ప స్ఫూర్తితో నిర్వహించిన ఈ సదస్సు భారత్ ఆత్మను ప్రపంచానికి మరోసారి తెలియచేసింది. ప్రపంచమంతా వసుధైక కుటుంబం అనే మన భారతీయ సంస్కృతిని చాటుతూ దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు దోహదపడేలా జి20 సదస్సు నిర్వహించిన శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి ఈ సమావేశం అభినందనలు తెలియచేస్తుంది.