పేద‌ల సొంతింటి క‌ల దూరం చేసిన జ‌గ‌న్‌

  • టిడ్కో ఇళ్లకు జగన్‌ గ్రహణం
  • గృహ ప్ర‌వేశాలు జ‌ర‌గ‌కుండానే బ్యాంకుల నుంచి నోటీసులు
  • జ‌న‌సేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కో -కన్వీనర్ పెంటేల బాలాజి

చిల‌క‌లూరిపేట‌: పేదల పెన్నిధినని చెప్పుకొనే ముఖ్యమంత్రి జగన్‌ పట్టణ పేదల ఇళ్లపై పగబట్టారని జ‌న‌సేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కో -కన్వీనర్, ఉంగుటూరు నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు పెంటేల బాలాజి చెప్పారు. మంగ‌ళ‌వారం ఆయ‌న కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌ర్ల స‌మావేశంలో బాలాజి మాట్లాడుతూ.. చంద్రబాబుపై కక్షతో ఆయన హయాంలో శ్రీకారం చుట్టిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వకుండా పాడుపెట్టారని, గత ప్రభుత్వ హయాంలోనే దాదాపుగా పూర్తయిన ఇళ్ల నిర్మాణాలను కూడా అసంపూర్తిగా వదిలేశారని మండి ప‌డ్డారు. చంద్రబాబు మంజూరు చేశారన్న ఒకే ఒక్క కారణంతో పేదల ఆశలను అడియాసలు చేశారని ఆరోపించారు. పట్టణ పేదలకు పక్కా ఇళ్లు అందించాలన్న లక్ష్యంతో టీడీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్ల నిర్మాణా శ్రీకారం చుట్టిందని దాదాపు 6 లక్షల ఇళ్ల నిర్మాణపు పనులు చేపట్టిందని తెలిపారు. గత ఎన్నికల సమయానికి టీడీపీ ప్రభుత్వ హయాంలోనే దాదాపు 2.70 లక్షల ఇళ్ల నిర్మాణం దాదాపుగా పూర్తయింద‌ని గుర్తు చేశారు. పూర్తి అయిన ఇళ్ల‌ను ల‌బ్దిదారుల‌కు అంద‌జేయడానికి సైతం జ‌గ‌న్ అంగీక‌రించ‌లేద‌న్నారు. జగన్‌ సర్కారు వచ్చాక టిడ్కో ఇళ్లకు గ్రహణం పట్టిందని. ఎక్కడి నిర్మాణాలను అక్కడ ఆపేసిందన్నారు. రాష్ట్ర‌లో 90 శాతం పనులు జరిగిన నిర్మాణాలను కూడా పూర్తి చేయకుండా గాలికి వదిలేయ‌టంతో చాలా చోట్ల టిడ్కో ఇళ్ల సముదాయాలు ముళ్ల చెట్ల పొదలతో నిండిపోయాయని వెల్ల‌డించారు. తాగునీరు, రోడ్లు, విద్యుత్‌, డ్రెనేజీ వంటి కనీస మౌలిక సదుపాయాలను కల్పించలేదన్నారు. గృహ ప్ర‌వేశాలు జ‌ర‌గ‌కుండానే బ్యాంకుల నుంచి నోటీసులు చిల‌క‌లూరిపేట‌లో సైతం 52 ఎక‌రాల్లో నిర్మించిన గ‌త ప్ర‌భుత్వ హ‌యంలో 95 శాతం పూర్త‌యిన ఇళ్ల‌ను ల‌బ్దిదారుల‌కు కేటాయించ‌టానికి పెద్ద ప్ర‌హ‌స‌నం న‌డిచింద‌ని గుర్తు చేశారు. చివ‌రి రెండేళ్ల కాలంలో కొంత‌మందికి మాత్ర‌మే ఇళ్లు కేటాయించార‌ని, అక్క‌డ వ‌స‌తులు క‌ల్పించ‌టంతోనూ నిర్ల‌క్ష్యం వ‌హించార‌ని వివ‌రించారు. వివిధ కార‌ణాల‌తో ల‌బ్దిదారుల‌కు ఇళ్లు కేటాయించ‌లేద‌ని, గృహ ప్ర‌వేశాలు జ‌ర‌గ‌కుండానే బ‌కాయిలు చెల్లించాల‌ని బ్యాంకుల నుంచి నోటీసులు వ‌స్తున్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. టిడ్కో గృహాల ల‌బ్దిదారుల‌కు నివేశ‌న గృహాలు కేటాయించ‌క‌పోవ‌డంతో వేలాది రూపాయాలు ఇంటి అద్దెల‌కు చెల్లించ‌లేక‌, పేద మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పూర్త‌యిన ఇళ్ల‌ను కేటాయించ‌క‌పోవ‌డం, కేటాయించిన వారికి వ‌స‌తులు క‌ల్పించ‌క‌పోవ‌డంతో టిడ్కో గృహాల వ‌ద్ద నివాసం ఉండ‌టానికి సైతం ప్ర‌జ‌లు సంకోచిస్తున్నార‌ని వెల్ల‌డించారు. టిడ్కో గృహాల‌ను ల‌బ్దిదారుల‌కు అందించకుండా పేద‌ల సొంతింటి క‌ల దూరం చేసిన ఘ‌న‌త జ‌గ‌న్ ప్ర‌భుత్వానికే ద‌క్కుతుంద‌న్నారు.