జగనన్న కట్టేవి గాలిలో మేడలే.. !

• ఆప్షన్ 3లో పేదలకు ఇళ్లు కట్టలేక డీలా పడిన ప్రభుత్వం
• ఇప్పుడు రాజధాని ప్రాంతంలో మరో 45 వేల ఇళ్లు కట్టిస్తామని హామీ
• బోర్డు తిప్పేసిన రాక్రీట్ ఇన్ ఫ్రాపై స్పందనేదీ..?
• నాలుగున్నరేళ్లలో కట్టిన ఇళ్లు 9631 మాత్రమే

గాలిలో మేడలు కట్టాలన్నా… మాయమాటలు చెప్పి పేదలను నయవంచన చేయాలన్నా ముఖ్యమంత్రి జగన్ కే చెల్లింది. రాజధాని అమరావతిలోని ఆర్‌-5 జోన్‌లో రాజధానేతరులకు 45 వేల ఇళ్లను ఆప్షన్‌-3 కింద ప్రభుత్వమే కట్టించి ఇస్తుందని మళ్లీ కొత్త పల్లవి అందుకున్న జగన్ …. గతంలో ఇచ్చిన ఆప్షన్ 3 హామీల మేరకు ఎన్ని ఇళ్లు కట్టించి ఇచ్చారో, ఎంతమంది పేదలను సొంతింటి వారిని చేశారో వివరించిన తర్వాత రాజధాని ప్రాంతం ఇళ్లపై కొత్త హామీ ఇచ్చి ఉంటే బాగుండేది. ఇళ్లు కట్టించే పేరుతో జరిగిన అవినీతి, మోసాన్ని గ్రహించి ఉంటే ఇంకా బాగుండేది. జగనన్న కాలనీల్లో ఆప్షన్ 3 కింద ప్రభుత్వం కట్టించి ఇచ్చే ఇళ్లు చాలా చోట్ల ఆగిపోయాయి. కడుతున్న ఇళ్లు సైతం నాణ్యత లేకుండా కనిపిస్తున్నాయి. ఆప్షన్‌-3 కింద రాష్ట్రవ్యాప్తంగా 3.52 లక్షల మందికి ఇళ్లు కట్టిస్తామని ఊదరగొట్టిన జగన్ దాన్ని గాలికి వదిలేశారు.
• ప్రభుత్వం పేదల ఇళ్లకు ఇచ్చిన మూడో ఆప్షన్ లో 3.52 లక్షల ఇళ్లు కట్టాల్సి ఉంటే, ఇప్పటివరకు వాటిలో పూర్తయినవి 9,631 ఇళ్లు మాత్రమే. షియర్‌ వాల్‌ టెక్నాలజీతో ఆరు నెలల్లో అమరావతిలో ఇళ్లు కడతామని చెబుతున్న ప్రభుత్వం అక్కడ కోర్టు కేసులను లెక్క చేయకుండా పూర్తి చేస్తామని మాట ఇస్తోంది. అదే విధానాన్ని మిగతా పేదలకు ఎందుకు వర్తింపజేయరు? అంటే ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు.
• అమరావతిలో రాజధానేతరుల ఇళ్ల నిర్మాణానికి సీఎం జగన్‌ గత నెలలో 50,793 మందికి పట్టాలు పంపిణీ చేశారు. ఇందులో 45 వేల మంది ప్రభుత్వమే ఇళ్లు కట్టించి ఇవ్వాలనే ఆప్షన్‌ను ఎంచుకున్నారు. 45 వేల ఇళ్ల నిర్మాణానికి గుత్తేదారుల ఎంపిక కొనసాగుతోంది. ఈ ఇళ్ల నిర్మాణాన్ని 6-8 నెలల్లో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇలా ఆగమేఘాలపై కదులుతున్న ప్రభుత్వం… రాష్ట్రవ్యాప్తంగా ఇచ్చిన పట్టాల విషయంలో, ఇళ్ల నిర్మాణం పూర్తి చేసే విషయంలోఇదే దూకుడు ఎందుకు ప్రదర్శించడం లేదు? ప్రారంభించిన రెండేళ్ల తర్వాత కూడా 2.20 లక్షల ఇళ్లు ఇంకా పునాది, అంతకంటే తక్కువ స్థాయిలో ఎందుకు ఉన్నాయన్న దానిపై ఎందుకు దృష్టి నిలపడం లేదన్నది ప్రజలు ఆలోచించాలి.
• అమరావతి విషయంలో రాజకీయాలు చేసి, రాజధాని అంశంలో కంపు చేసేందుకు, లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్న వైసీపీ ఇక్కడ అగ్గి రాజేయడానికి శతవిధాలా ప్రయత్నిస్తోంది. పేదలకు ఇళ్లు కట్టించిన తర్వాత, అక్కడి నుంచి వారిని తరలించినా, ఇళ్లు రద్దు చేసినా కొత్త సమస్యలు సృష్టించేందుకు వైసీపీ కొత్త అస్త్రాలను సిద్ధం చేస్తోంది. పేదలకు ఇళ్లు ఇవ్వడం ద్వారా అమరావతిలో ఇతర అవసరాలకు, అభివృద్ధికి భూమి కేటాయింపులు లేకుండా చేయాలన్నది ప్లాన్.
• రాష్ట్రవ్యాప్తంగా 3.52 లక్షల ఇళ్లు కట్టేందుకు రాష్ట్రప్రభుత్వం 742 గుత్తేదారు సంస్థలను ఎంపిక చేసింది. అందులో 63 వేల ఇళ్ల నిర్మాణాన్ని వైకాపా ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి బంధువు, అనుచరవర్గం డైరెక్టర్లుగా ఉన్న రాక్రీట్‌ ఇన్‌ఫ్రా సంస్థకు కట్టబెట్టింది. ఈ ఇళ్ల నిర్మాణ విలువ రూ.1,100 కోట్లు. టెండరు విలువ రూ.100 కోట్లు దాటితే జ్యుడిషియల్‌ ప్రివ్యూ కమిటీ ఆమోదం తర్వాత గుత్తేదారులను ఖరారు చేస్తామని చెప్పిన జగన్‌.. నాలుక మడతేసి నేరుగా ఈ కాంట్రాక్టులను అప్పగించేశారు. ఎక్కడికక్కడ లబ్ధిదారులే గుత్తేదారు సంస్థతో ఒప్పందం చేసుకున్నారని ప్రభుత్వం సమర్థించుకుంటోంది. కానీ ఆ సంస్థ పూర్తిచేసిన ఇళ్లు మాత్రం వెయ్యిలోపే! పైగా విజయవాడ గ్రామీణంలోని నున్న, గుంటూరు జిల్లా పేరేచెర్ల లేఅవుట్‌లో కేటాయించిన ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయకుండానే చేతులెత్తేశారు. చివరకు ఆ సంస్థకు కేటాయించిన కొన్ని ఇళ్లను అధికారులు రద్దుచేసి వేరే సంస్థలకు అప్పగించారు.
• ఏలూరు, తణుకు, తాడేపల్లిగూడెం లాంటి చోట్ల ఈ సంస్థ లబ్ధిదారుల నుంచి ముందుగానే డబ్బులను కట్టించుకుంది. ప్రతి లబ్ధిదారుడి వద్ద నుంచి డ్వాక్రా సంఘాల ద్వారా వచ్చే రుణంలో రూ.30 నుంచి రూ.50 వేలు ముందుగానే వసూలు చేశారు. తర్వాత ఇళ్లు కూడా నిర్మించకుండా చేతులెత్తేశారు. దీనిపై ఆయా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున దుమారం చెలరేగినా అధికారులు కిమ్మనకుండా ఉండిపోయారు. ఇళ్లు పూర్తి కాక, లబ్ధిదారుల నుంచి డబ్బులను సేకరించి రాక్రీట్ ఇన్ ఫ్రా జెండా ఎత్తేయడంపై ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదు.
• ప్రభుత్వం నుంచి వచ్చే రూ.1.80 లక్షలతో ఇళ్లు పూర్తి చేస్తామని, అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగిస్తామని మాయమాటలు చెప్పిన ఈ సంస్థ కనీసం ఎలాంటి ఇళ్లను నిర్మించలేదు. దీనిపై గృహనిర్మాణ శాఖ కూడా ఇప్పటి వరకు ఓ సమీక్ష సమావేశం నిర్వహించిన పాపాన పోలేదు.
• సీఎం జగన్‌ సొంత ఇలాకా పులివెందులలోనూ ఏడాదిన్నర క్రితం ఆ సంస్థ ప్రారంభించిన ఇళ్లకూ అతీగతీ లేదు. ఇప్పటికీ ఇక్కడ ఒక్క ఇంటినీ పూర్తిచేయలేదు. ఆప్షన్‌-3 కింద ప్రభుత్వం కడుతున్న ఇళ్ల తీరు కొన్ని జిల్లాల్లో దారుణంగా ఉంది. పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల పరిధిలో పూర్తయిన ఇళ్లు ‘సున్నా’. కర్నూలు జిల్లాలో ఒక్క ఇల్లే పూర్తయింది.
• రాష్ట్రంలో ఆప్షన్ 3 కింద కట్టాల్సిన ఇళ్లు 3,52,274 అయితే, ఇప్పటి వరకు పూర్తయినవి కేవలం 9,631 మాత్రమే.. పునాది దశలోనే ఉండిపోయినవి 94,956 అయితే, బేస్ మెంట్ స్థాయిలో 1,16,662 ఇళ్లు ఉండిపోయాయి. రూఫ్ లెవెల్, రూఫ్ కాస్ట్ లెవల్లో కనిపిస్తున్నవి 20,233 అయితే ఇప్పటి వరకు కనీసం ప్రారంభం కావివి 8,902గా లెక్కలు కనిపిస్తున్నాయి.
• వినేవాళ్లు వెర్రివాళ్లయితే… చెప్పేవాడు జగన్ అవుతాడంట. ముఖ్యమంత్రి చెప్పే మాటల్లో ఏదీ నమ్మలేని పరిస్థితికి సామాన్యుడు వచ్చాడు. కోర్టులో తుది తీర్పు రాని స్థలాల్లో పేదల ఇళ్లకు తాజాగా శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి… ముద్దులు పెట్టి మరీ గతంలో పేదలకు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన ఇళ్ల పరిస్థితి ఏమిటనేది కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.