జగనన్న ఇళ్లు.. వైసీపీ నేతలకు కాసుల పంట

* పేదలను బెదిరించి లాక్కోవాలని చూస్తున్నారు
* కుటుంబ ఆస్తులు పెంచుకోవడమే వైసీపీ ఉత్తరాంధ్ర నాయకుల లక్ష్యం
* మత్స్యకారులను పూర్తిగా విస్మరించిన ప్రభుత్వం
* జనసైనికులు ధైర్యంగా పోరాడాలి
* బొబ్బిలి నియోజకవర్గ సమీక్ష సమావేశంలో జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్

‘జగనన్న ఇళ్ల పేరుతో వైసీపీ నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు.. పేదోడికి కనీసం సొంత ఇల్లు లేకుండా చేశారు. చాలా తక్కువ మొత్తంలో రైతులు వద్ద నుంచి భూములు కొనుగోలు చేసి ఎక్కువ మొత్తంలో ప్రభుత్వం నుంచి పరిహారం జేబులో వేసుకున్నారు.. ఇదంతా ప్రణాళిక ప్రకారం జరిగిన దోపిడీ’ అని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు అన్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లా పార్టీ సమీక్ష సమావేశాల్లో భాగంగా శుక్రవారం ఉదయం బొబ్బిలి నియోజకవర్గం సమీక్ష సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలోని సమస్యలను పార్టీ పరిస్థితులను జనసైనికులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “జగనన్న ఇళ్ల కోసం ఇచ్చే పట్టా ఎందుకు పని చేస్తుందో.. దాని మీద ఏమీ ఉందో కూడా అర్ధం కాని పరిస్థితి ఉంది. ఇచ్చిన భూమిని కూడా పేదల దగ్గర నుంచి బెదిరింపులు చేసి లాక్కోవాలని చూస్తున్నారు. కుటుంబ ఆస్తులు పెంచుకోవడం కోసం ఉత్తరాంధ్ర నాయకులు రాజకీయంగా పని చేయడంతోనే సరిపోయింది. ఇక్కడి ప్రజల జీవన ప్రమాణాలు, బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచన లేదు. ఉత్తరాంధ్ర ప్రజలకు న్యాయం చేయలేని ఈ ప్రభుత్వం తన చర్యను సమర్ధించుకోవడానికి మాత్రం ముందుంటుంది. ఉత్తరాంధ్రకు ఏం చేశారని ప్రశ్నిస్తే.. వారిపై బూతులతో తిట్టించడం అలవాటు చేసుకున్నారు. ఉత్తరాంధ్ర ప్రజల అభ్యున్నతి మీద వైసీపీ నాయకులకు దృష్టి ఉందా? సొంత రాష్ట్ర అభివృద్ధి కోసం కనీసం పరిశ్రమలు ఉపాధి కూడా చూపలేకపోయారు. ఈ ప్రభుత్వం వచ్చాక ఉత్తరాంధ్ర ప్రాంతం మరింత వెనక్కు వెళ్లిపోయింది.
* వేట విరామ భత్యం కూడా న్యాయంగా ఇవ్వడం లేదు
మత్స్యకారులు వేటకు వెళ్ళని సమయంలో ప్రభుత్వం న్యాయబద్ధంగా అందించే వేట విరామ భత్యం కూడా చాలా మందికి అందడం లేదు. దానికి రకరకాల కారణాలు చెప్పి ఆపేస్తున్నారు. రాష్ట్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు 1.91 లక్షల మంది ఉంటే కేవలం వేట విరామ భత్యం మాత్రం 90 వేల మందికే వస్తోంది. ఈ విషయంలోనూ మత్స్యకారులకు వైసీపీ ప్రభుత్వం న్యాయం చేయడం లేదు. మత్స్యకార భరోసా పేరుతో ఇస్తున్న డబ్బులు కూడా అర్హులకు అందడం లేదు. ఈ అంశాల మీద జనసేన పార్టీ పూర్తి చిత్తశుద్ధితో పోరాడుతుంది. గుజరాత్ రాష్ట్రంలో ప్రతి 25 కిలోమీటర్లకు ఒక చిన్న ఫిషింగ్ హార్బర్ లేదా జెట్టిలు ఉంటాయి. 975 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్లో మాత్రం జెట్టిలు, చిన్న చిన్న ఫిషింగ్ హార్బర్ల ఊసే లేదు. మత్స్యకారులకు ఉపాధి చూపించకుంటే వారు వలసలు వెళ్ళక ఎలా ఉంటారు..? వారి కుటుంబాలు ఎలా గడుస్తాయి..? రూ.600 కోట్లతో ఉత్తరాంధ్ర ప్రాంతంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తామని చెప్పారు.. ఇప్పటి వరకు ఒక్క ఇటుక వేయలేదు. ఉత్తరాంధ్రలో కీలకమైన 34 గ్రామాలను ఒడిశా తీసుకోవాలని చూస్తోంది. దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో ఉత్తరాంధ్ర ప్రజలకు వివరించాలి.
* కావాలని సమస్యలు సృష్టిస్తారు జాగ్రత్త..!
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జనసైనికులు కట్టుబడి ఉండాలి. జన సైనికుల ఐక్యత రాజకీయ శత్రువులను భయపెట్టాలి. మనలో మనకి విభేదాలకు రకరకాల ప్రయత్నాలు జరుగుతాయి. వాటిని ఆలోచనతో ధైర్యంగా ఎదుర్కోవాలి. జన సైనికులు ఒకరికొకరు సమాచారం ఇచ్చుకుని ముందుకు సాగాలి. ప్రజా ఉద్యమాలలో ధైర్యంతో ముందుకు సాగండి. భవిష్యత్తులో విజయనగరంలో గొప్ప మార్పు తీసుకువద్దాం. ఉపన్యాసాల వల్ల, సోషల్ మీడియాలో ప్రసంగాల వల్ల నాయకులు అయిపోదామంటే కుదరదు. క్షేత్రస్థాయిలో పదిమంది జనసైనికుల్ని కలుపుకొని ప్రజా సమస్యల మీద పోరాడడంలోనే నాయకత్వం ఉంటుంది. ఈ పోరాటంలో మీకు ఎదురయ్యే ఏ సమస్యకైనా జనసేన పార్టీ అండగా నిలుస్తుంది” అన్నారు. ఈ సమావేశంలో పార్టీ పీఏసీ సభ్యులు ముత్తా శశిధర్, పార్టీ నేతలు గిరడా అప్పలస్వామి, వంపూరు గంగులయ్య, బాబు పాలూరి, శ్రీమతి ఎ.దుర్గా ప్రశాంతి, బోడపాటి శివదత్ తదితరులు పాల్గొన్నారు.
* జనసేన పార్టీలో చేరికలు
ఇంటర్మీడియట్ బోర్డు రీజనల్ జాయింట్ డైరెక్టర్ గా పనిచేసి ఇటీవల రిటైర్ అయిన ఆమదాలవలసకు చెందిన పాత్రుని పాపారావు జనసేన పార్టీలో చేరారు. నాదెండ్ల మనోహర్ ఆయనకు పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. పార్టీ కోసం తపనతో క్షేత్ర స్థాయిలో పని చేయాలని సూచించారు. ఆయనతోపాటు శ్రీకాకుళంకు చెందిన పొదిలాపు స్వామి నాయుడు జనసేన పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై పార్టీలో చేరారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన పార్టీ నాయకుడు పెడాడ రామ్మోహన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.