టిడ్కో నిర్మాణాలను పూర్తి చేసి పేదలకు అందించాలి

  • పేదలకు పనికిరాని భూములను కేటాయించడం దుర్మార్గం
  • జగనన్న ఇళ్ళు-పేదలకు కన్నీళ్లు కార్యక్రమంలో జనసేన రాష్ట్ర పార్టీ కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యలు.

సత్తెనపల్లి, జనవారధి పట్టణంలో గత ప్రభుత్వంలో చేపట్టిన టిడ్కో గృహాలు నిర్మాణ దశలోనే ఆగిపోవటం పట్ల జనసేన పార్టీ నిరసన వ్యక్తం చేస్తూ టిడ్కో గృహల వద్ద ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. జనసేనాని పవన్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న కాలనీలు,టిడ్కో ఇళ్ల నిర్మాణాలపై జగనన్న ఇళ్లు – పేదలకు కన్నీళ్లు అంటూ నిరసన కార్యక్రమాలు చేస్తున్నామని, అందులో భాగంగా సత్తెనపల్లి నియోజకవర్గంలో టిడ్కో గృహాలు, జగనన్న కాలనీలు సందర్శించి ఇక్కడ జరుగుతున్న లోపాలను, అవినీతిని ప్రశ్నించేందుకు సిద్ధమయ్యామని తెలిపారు. 4 ఏళ్ల క్రితం మొదలుపెట్టిన ఈ టిడ్కో ఇల్లు గత ప్రభుత్వం కట్టిందనే వంకతో నిలిపివేశారని, పేదలను పేదలుగానే ఉండాలన్న ఆలోచన వైసిపి ప్రభుత్వం చేస్తుందని విమర్శించారు. ఇది చాలా దుర్మార్గమని, లబ్ధిదారులకు వెంటనే ఇళ్లు నిర్మాణం పూర్తి చేసి ఇవ్వాలని లేకుంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామని పేర్కొన్నారు.

  • మరొక చోట స్ధలాలను ఇవ్వాలి:

పాకాలపాడు గ్రామంలో జగనన్న ఇళ్ల నిర్మాణానికి కేటాయించిన స్ధలాన్ని పరిశీలించి మాట్లాడారు. నివాసానికి పనికిరాని ప్రాంతంలో స్ధలాలను కేటాయించారని, పిల్లర్ వేయటానికి ఈ ప్రాంతం పనికిరాదని ఆరోపించారు. ఈ స్ధలాలను క్యాన్సిల్ చేసి మరొక చోట మంచి స్ధలాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం పాకాలపాడు, కంకణాలపల్లి, ధూళిపాళ్ల, రాజుపాలెం, రెడ్డిగూడెం, గణపవరం గ్రామాలలో జరుగుతున్న ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ కార్యదర్శి నాయబ్ కమాల్,జిల్లా అధికార ప్రతినిధి తవిటి భవన్నారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి సాంబశివరావు, పలు మండలాల పార్టీ అధ్యక్షులు, వీర మహిళలు, నాయకులు పాల్గొన్నారు.