మున్సిపల్ ఎన్నికల్లో జనసేన బోణీ..

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో జనసేన పార్టీ తన ప్రభావాన్ని చూపిస్తోంది. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలోని 4వ వార్డులో జనసేన అభ్యర్థి విజయం సాధించారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగానూ జంగారెడ్డిగూడెం ప్రాంతంలో జనసేన ప్రభావం కనిపించింది. దీంతో మున్సిపల్ ఎన్నికల్లోనూ ఇదే హవాను కొనసాగిస్తామని జనసేన పార్టీ చెప్తోంది. ఇక్కడ గెలుపుపై జనసైనికులు ధీమాతో ఉన్నారు. అటు వైసీపీ కూడా మెరుగైన ఫలితాలు సాధిస్తోంది. స్థానిక ఎమ్మెల్యే ఎలీజా జంగారెడ్డిగూడెంను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అయినా గోదావరి జిల్లాల్లో జనసేన ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.

మరోవైపు తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రధాన కేంద్రమైన అమలాపురంలో జనసేన అభ్యర్థులు దూసుకెళ్తున్నారు. అమలాపురంలో 30 వార్డులు ఉండగా.. అందులో 6 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 24 వార్డులకే ఎన్నికలు నిర్వహించారు. పట్టణంలోని 3,4,6,7 వార్డుల్లో జనసేన అభ్యర్థులు దూసుకెళ్తున్నారు. ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్లలోనూ జనసేనకు ఆధిక్యం లభిచింది. గోదావరి జిల్లాల్లోని అన్ని మున్సిపాలిటీల్లో జనసేనకు మెరుగైన స్థానాలు వచ్చే అవకాశమున్నట్లు ఆ పార్టీ నేతలు చెప్తున్నారు.