ముస్లిం పేద పిల్లల ఉన్నత విద్యపై జనసేన ప్రత్యేక దృష్టి

  • పాలకులు ముస్లింలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నారు
  • జనసేన పార్టీ ఇఫ్తార్ విందులో పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు
  • హైదరాబాద్ లో ఘనంగా జనసేన పార్టీ ఇఫ్తార్ విందు

హైదరాబాద్, భవిష్యత్తులో జనసేన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ముస్లింల సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు పేర్కొన్నారు. ముస్లిం కుటుంబాల్లో ఎక్కువ మంది పేదలుగానే మిగిలిపోయారని, గత పాలకులు మైనార్టీలను ఓటు బ్యాంకుగానే చూశారు తప్ప వాళ్ల అభివృద్ధికి కృషి చేయలేదని అన్నారు. ముస్లిం పేదల పిల్లల ఉన్నత విద్యపై ప్రత్యేక దృష్టి పెడుతుందని చెప్పారు. పవిత్ర రంజాన్‌ మాసాన్ని పురస్కరించుకుని జనసేన పార్టీ ముస్లింలకు ఘనంగా ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేసింది. బుధవారం సాయంత్రం హైదరాబాద్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి నాగబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ “జనసేన పార్టీకి అన్ని కులాలు, అన్ని మతాలు సమానమే. చిన్నప్పుడు మేము ఒక ముస్లిం సోదరుడి ఇంట్లో అద్దెకు ఉండేవాళ్లం. మా ఇంటికి పక్కనే మసీదు ఉండేది. వాళ్లు మాపై చూపించిన ప్రేమ ఇప్పటికీ మరిచిపోలేనిది. ఇస్లాం విద్య, ధార్మిక సంస్థల ప్రార్థన స్థలాలకు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రూపయలు 25 లక్షలు విరాళంగా ఇవ్వడం చాలా సంతోషంగా అనిపించింది. అధికారంలోకి వచ్చాక చేస్తామని కాకుండా ముందే వాళ్ల సంక్షేమం, అభివృద్ధికి తన వంతు సాయం చేయడం గర్వించదగ్గ విషయం. పవన్ కళ్యాణ్ మాటలు చెప్పే మనిషి కాదు చేతల్లో చూపించే మనిషి. ముస్లింలకు ఎంత వరకు సేవ చేయాలో అంతవరకు ఆయన చేస్తారు” అన్నారు.

  • మత సామరస్యాన్ని పెంచేందుకే ఇఫ్తార్: అర్హం ఖాన్
    పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు అర్హం ఖాన్ మాట్లాడుతూ “ మత సామరస్యానికి, ప్రజల్లో సోదరభావం పెంచడానికి పవన్ కళ్యాణ్ ఈ ఇఫ్తార్‌ విందును ఏర్పాటు చేశారు. ఆయనకు అన్ని కులాలు, మతాలు సమానమే. మిగతా పొలిటికల్ పార్టీల్లాగా ఇది పొలిటికల్ ఇఫ్తారు కాదు. సోదర భావాన్ని, మత సామరస్యాన్ని సమాజంలో మరింత పెంచడానికి ఏర్పాటు చేసిన విందు” అన్నారు.
  • పేదవాడి ఆకలి తీర్చడమే రంజాన్ ముఖ్య ఉద్దేశం : సిరాజ్ ఉర్ రెహ్మాన్
    ఇస్లాం ధార్మిక ఉపన్యాసకులు మహ్మద్ సిరాజ్ ఉర్ రెహ్మాన్ మాట్లాడుతూ “పేదవాడి ఆకలి, దప్పికల బాధలను తెలుసుకోవడమే పవిత్ర రంజాన్ మాసం ముఖ్య ఉద్దేశం. ఈ పవిత్ర మాసంలోనే ముస్లింల పవిత్ర గ్రంధమైన ఖురాన్ ఆవిర్భవించింది. ప్రపంచంలో ఏ దేశంలో లేని మత సామరస్యం మన దేశంలో ఉంది. అదే మన దేశం గొప్పతనం. ఏ పవిత్ర గ్రంథమైనా చెప్పేది ఒక్కటే… మనుషుల మధ్య సోదర భావాన్ని పెంపొందించి, ఆత్మీయత, సుహృద్భావంతో బతికేలా చేస్తోంద”ని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి నేమూరి శంకర్ గౌడ్, అధ్యక్షుల వారి రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్, పార్టీ నేతలు ముకరం చాంద్, సయ్యద్ సాదిక్, మీర్జా ఆబిద్, అర్షద్, కూసంపూడి శ్రీనివాస్, యాతం నగేష్, లక్షణ్ గౌడ్, దామోదర్ రెడ్డి, నటుడు హైపర్ ఆది, ముస్లిం సోదరులు మరియు గ్రేటర్ హైదరాబాద్ నాయకులు, నియోజకవర్గ కో ఆర్డినేటర్లు, తెలంగాణలో ఉమ్మడి జిల్లాలో ఉన్న జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.