తిరుపతిలో పోటీకి జనసేన ఆసక్తి..? ఈ నెల 16,17 తేదీల్లో సమావేశం

ఆంధ్రప్రదేశ్‌లో ‘తిరుపతి’ కేంద్రంగా వేగంగా మారుతున్న రాజకీయాలు పలు చర్చలకు ఊతమిస్తున్నాయి. తిరుపతి వైసీపీ ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ అకాల మరణంతో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. తిరుపతిలో గెలిచి సత్తా చాటాలని బీజేపీ – జనసేన భావిస్తున్నాయి. మిత్రపక్షం బీజేపీ, తాము పోటీ చేయనున్నట్లు ప్రకటించగా, జనసేన నుంచి ఇంతవరకు ఎలాంటి ప్రకటనా రాలేదు. జనసేన మద్దతుతో బీజేపీ, తిరుపతి ఉప ఎన్నికలో విజయం సాధిస్తుందని బీజేపీ నేతలు ఇప్పటికే ప్రకటించేసుకున్నారు.

ఇటీవల తెలంగాణలోని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో అధికార టీఆర్‌ఎస్‌కి షాకిచ్చి బీజేపీ, అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్న విషయం విదితమే. అదే ఫలితం తిరుపతిలో రిపీట్‌ అవుతుందన్నది బీజేపీ నమ్మకం. అక్కడ సోలిపేట రామలింగారెడ్డి మరణంతో ఖాళీ అయిన స్థానాన్ని బీజేపీ దక్కించుకున్నట్లే… ఇక్కడ బల్లి దుర్గా ప్రసాద్ మరణంతో ఖాళీ అయిన స్థానాన్ని తాము దక్కించుకుంటామన్న ధీమాతో ఉంది.

అదే సమయంలో మిత్రపక్షం జనసేన కూడా తనదైన లెక్కతో ముందుకు కదులుతున్నట్లు ఊహాగానాలు బయలుదేరాయి. ఇంతకీ జనసేన లెక్కేంటి… తిరుపతి బరిలో బీజేపీ-జనసేన రాజకీయం ఎలా ఉండబోతుంది.. తిరుపతి ఉపఎన్నికలో తాము పోటీ చేయబోతున్నట్లు బీజేపీ ప్రకటించింది. ఇందుకు జనసేన మద్దతు కూడా ఉందని తెలిపింది. ఇప్పటికే క్షేత్ర స్థాయిలో సన్నాహక కార్యక్రమాలు కూడా మొదలుపెట్టింది.

మరోవైపు తిరుపతిలో పోటీ చేసేందుకు జనసేన ఆసక్తిని కనబరుస్తోందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మంగళగిరిలోని ఆ పార్టీ కార్యాలయంలో ఈ నెల 16,17 తేదీల్లో జరగనున్న క్రియాశీలక సమావేశాల్లో ‘తిరుపతి’లో పోటీ అంశాన్ని జనసేనాని పవన్ చర్చించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సభ్యత్వ నమోదు విజయవంతమైన నేపథ్యంలో ఈ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు చెప్తున్నప్పటికీ.. ‘తిరుపతి’పై ఫోకస్ పెట్టేందుకే ఈ మీటింగ్స్ అన్న చర్చ కూడా జరుగుతోంది.