కార్మికులకు అండగా జనసేన ఉంటుంది

*ఏసీ గదుల్లో కూర్చొని కాదు.. నడిరోడ్డుపై నిలువు కాళ్ళ మీద నుంచొని అపరిశుభ్రంగా ఉన్న సమాజాన్ని కార్మికులు తమ స్వహస్తాలతో శుభ్రపరుస్తున్నారు.

*పారిశుద్ధ్య కార్మికులు చేసే పనికి లక్ష రూపాయలు ఇచ్చినా తక్కువే అవుతుంది అంటూ.. చెప్పిన పాదయాత్ర నాటి మాటలు ఏమయ్యాయి ముఖ్యమంత్రి గారూ

*ఆరోగ్య, ఆర్ధిక భద్రత లేని పని ఇంకెన్నాళ్లు?

*కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తీర్చేవరకు జనసేన కార్మికులకు అండగా ఉంటుంది.. వారితో కలిసి పోరాడుతుంది

*న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కార్మిక సంఘాల యూనియన్ నాయకులు చేపట్టిన ధర్నాకు సంఘీభావం తెలియచేసిన జనసేన పార్టీ నాయకులు

గుంటూరు: సూర్యుడు రాకముందే విధుల్లో చేరి చెత్తాచెదారాన్ని.. ప్రజలు విసర్జించే మాలమూత్రాలను తీసేసి.. పరిసరాలను పరిశుభ్రం చేసి ప్రజలకు ఆరోగ్యాన్ని.. ఆహ్లాదాన్ని పంచే పారిశుద్ధ్య కార్మికులు తమ శ్రమకు తగ్గ ప్రతిఫలం అడగటమే నేరం అయినట్లు ప్రభుత్వం వ్యవహరించటం దారుణమని.. కార్మికుల పట్ల ప్రభుత్వ తీరుపై జనసేన పార్టీ నగర అధ్యక్షుడు నెరేళ్ల సురేష్ తీవ్రఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బుధవారం కార్మిక నాయకులు సోమి శంకరరావు, సోమి ఉదయ్ ఆధ్వర్యంలో తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుకుంటూ.. నగరపాలక సంస్థ ఎదుట మున్సిపల్ వర్కర్లు చేపట్టిన ధర్నాకు జనసేన పార్టీ పూర్తి మద్దతు ఇచ్చింది. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ కార్మికులు ఏమి గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని జగన్ పాదయాత్రలో ఇచ్చిన సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రత హామీలనే నెరవేర్చమని అడుగుతున్నారన్నారు. తాము అధికారంలోకి రాగానే పారిశుద్ధ్య, ఇంజినీర్, విద్యుత్ వంటి పలు శాఖల్లో పనిచేసే కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేస్తామని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు కావస్తున్నా నెరవేర్చకపోవటం వైసీపీ అవకాశవాద రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు. జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి మాట్లాడుతూ.. కార్మికులను అన్ని ప్రభుత్వాలు మోసం చేస్తూనే ఉన్నాయని.. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా వాళ్ళ సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మిగిలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులు ఏ సీ గదుల్లో కూర్చొని విధులు నిర్వర్తించరని.. నడిరోడ్డుపై నిలువు కాళ్ళమీద నిలబడి సమాజాన్ని శుభ్రపరుస్తున్నారని.. లేబర్ యాక్ట్ లో ఉన్న విధంగా వారంలో ఒకరోజు పూర్తి సెలవు ప్రకటించాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చాలని కార్మికులను మోసం చేస్తే ప్రభుత్వానికి పుట్టగతులుండవని హెచ్చరించారు. ఇప్పటికైనా నాయకులు అధికారులు కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని లేనిపక్షంలో ప్రజాక్షేత్రంలో ఎలాంటి పోరాటలకైనా, ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉన్నామని రెల్లి రాష్ట్ర యువజన సంఘ నాయకులు రెల్లి ఉదయ్ అన్నారు.
కార్యక్రమంలో కార్పొరేటర్లు యర్రంశెట్టి పద్మావతి, దాసరి లక్ష్మీ దుర్గ, వీరమహిళలు పాకనాటి రమాదేవి, బిట్రగుంట మల్లిక, విజయలక్ష్మి, ఆసియా, అరుణ, హైమావతి, కవిత, కొండూరి కిషోర్, యడ్ల నాగమల్లేశ్వరవు, సుధా నాగరాజు, నెల్లూరి రాజేష్, సూరిశెట్టి ఉదయ్, రవీంద్ర, కోటి, కిట్టూ, నాని, కొనిదేటి కిషోర్, చేజేర్ల శివ, జడ సురేష్, నవీన్, ప్రసాద్, కాసులు పాల్గొన్నారు.