ఊరిస్తున్న పత్తి ధర….వెక్కిరిస్తున్న విత్తనం ధర

*ఇబ్బడిముబ్బడిగా పెరగనున్న పత్తి సాగు
* వ్యాపారుల దోపిడీ విత్తనాలతోనే ఆరంభం
*పట్టీపట్టనట్టు వ్యవహరిస్తున్న ప్రభుత్వం
*ఆర్బీకేల్లో అమ్మాలంటూ రైతుల వేడుకోలు

ఆంధ్రప్రదేశ్ లో పత్తి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరగనుంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పత్తి ధర క్వింటా రూ.13,000 దాటిపోయింది. దీంతో ఎక్కువ మంది రైతులు పత్తి సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. ఇదే అదనుగా విత్తన వ్యాపారులు చెలరేగిపోతున్నారు. ఎమ్మార్పీ ధరల కన్నా రెట్టింపు ధరలకు పత్తి విత్తనాలు అమ్ముతున్నారు. అయినా అధికారులు కానీ, ప్రభుత్వంగానీ వారిని అదుపు చేసే చర్యలు తీసుకోవడంలేదు. దీంతో పత్తి రైతులు రెట్టింపు ధరలకు విత్తనాలు కొనుగోలు చేయాల్సి వస్తోంది. పత్తి సాగు ప్రారంభంలోనే రైతుపై అదనపు భారం పడింది. రైతు భరోసా కేంద్రాల్లో అన్ని విత్తనాలు అందుబాటులో ఉంచుతామని ఆర్బాటంగా ప్రకటించిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటోన్న దాఖలాలు కనిపించడం లేదు.
*పత్తి సాగు 2.40 లక్షల ఎకరాల్లో పెరిగే అవకాశం
పత్తి సాగు విస్తీర్ణం ఎన్నడూ లేని విధంగా పెరిగే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ముందస్తు పత్తి సాగు ప్రారంభించారు. సాధారణంగా ముందస్తు పత్తి సాగు 10000 ఎకరాల వరకు ఉంటుంది. కానీ ఈ సీజన్లో 33000 ఎకరాలు దాటింది. అనంతపురం, ప్రకాశం, నెల్లూరు, పల్నాడు జిల్లాల్లో ముందస్తు పత్తి సాగు గణనీయంగా పెరిగింది. రాష్ట్రంలో సాధారణ పత్తి సాగు విస్తీర్ణం 14,55,000 ఎకరాలు. 2020-21లో 15,08,000 ఎకరాలు, 2021- 22లో 13,04,000 ఎకరాలు, 2022- 23లో 15.42 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. ఇక ఈ సీజన్లో అంటే 2023 ఖరీఫ్ లో 18 లక్షలకుపైగా ఎకరాల్లో పత్తి సాగు చేపట్టే అవకాశం ఉందని అధికారులు ఓ అంచనాకు వచ్చారు. గత సీజన్ కన్నా ఈ ఏడాది 2.40 లక్షల ఎకరాల్లో పత్తి సాగు పెరిగే అవకాశం ఉంది. ఇందుకు గాను 36 లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు అవసరం అవుతాయి. ఒక్కో పత్తి విత్తన ప్యాకెట్ రూ.810 కాగా బ్లాక్ మార్కెట్లో రూ.1500 దాకా అమ్ముతున్నారు. అంటే పదెకరాలు పత్తి సాగు చేస్తే రూ.14000 అదనపు భారం పడుతుంది. పల్నాడు జిల్లా, ప్రకాశం, రాయలసీమలోని కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఇప్పటికే రైతులు ముందస్తు పత్తి సాగు చేపట్టారు. నీటి పారుదల సదుపాయం ఉన్న రైతులు వేసవిలోనే అంటే మే మొదటి వారంలోనే ముందస్తు పత్తి సాగు చేపడతారు. పత్తి సాగు విస్తీర్ణం అధికారులు అంచనా వేసిన దానికన్నా ఎక్కువే పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
*విత్తన ధరలపై పర్యవేక్షణ ఏదీ?
పత్తి విత్తన ధరల నిర్ణయాధికారం కేంద్ర ప్రభుత్వానిదే. బీటీ 2 పత్తి విత్తనాలు రైతులకు ఎంత ధరకు అమ్మాలనేది కేంద్రం నిర్ణయిస్తుంది. ఈ ఏడాది ప్యాకెట్ కు రూ.50 పెంచి, ఒక్కో ప్యాకెట్ ధర రూ.810గా నిర్ణయించింది. ఈ ధరకన్నా ఒక్క రూపాయి కూడా అదనంగా అమ్మడానికి వీల్లేదు. అయితే వ్యాపారులు కేంద్రం నిర్ణయించిన ధరలకు అమ్ముతున్నారా లేదా అనేది రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకోవాలి. కానీ అది జరగడం లేదు. కళ్లముందే పత్తి విత్తన వ్యాపారులు ధరలు పెంచి అమ్ముతుంటే వ్యవసాయ అధికారులు పట్టించుకోవడం లేదు. ప్యాకెట్ బీటీ 2 పత్తి విత్తనాలు రూ.810కి మాత్రమే అమ్మాల్సి ఉండగా, రైతుల అవసరాలను ఆసరాగే చేసుకొని రూ.1500దాకా వసూలు చేస్తున్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పత్తి విత్తనాల్లోనే రెట్టింపు ధరలు వసూలు చేయడం ద్వారా రైతుల వద్ద నుంచి వ్యాపారులు ఈ సీజన్లోనే దాదాపు రూ.250 కోట్లు దోచుకునే అవకాశం ఉంది.
*బీటీ 2 విత్తనాలే ఎందుకు?
రెండు దశాబ్దాల కిందట అంటే 2002లో బీటీ పత్తి విత్తనాలు అందుబాటులోకి వచ్చాయి. అంతకు ముందు పత్తిలో శనగపచ్చ పురుగు నివారణ కష్టంగా ఉండేది. ఎన్ని మందులు పిచికారి చేసినా శనగపచ్చ పురుగు అదుపులోకి వచ్చేది కాదు. దీంతో కొన్ని కంపెనీలు శనగపచ్చ పురుగును తట్టుకునే బీటీ విత్తనాలు తయారు చేశాయి. దీంతో సాధారణ పత్తి విత్తనాలు మరుగున పడిపోయాయి. అయితే గత ఏడేళ్లుగా గులాబీ పురుగు దాడి చేస్తోంది. బీటీ విత్తనాలు గులాబీ పురుగును నియంత్రించలేకపోతున్నాయి. తాజాగా మార్కెట్లోకి బీటీ 2 పత్తి విత్తనాలు అందుబాటులోకి వచ్చాయి. ఇవి గులాబీ పురుగును కొంత వరకు తట్టుకుంటాయని చెబుతున్నారు. రైతులు కూడా పురుగుమందుల ఖర్చులు తగ్గించుకునేందుకు ఎంత ఖర్చయినా బీటీ 2 పత్తి విత్తనాలతో సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో పత్తి సాగు అంటే బీటీ విత్తనాలే అన్న చందంగా తయారైంది. దీన్ని ఆసరాగా చేసుకుని ధరలు అమాంతం రెట్టింపు చేసి దోచుకుంటున్నారు.
*పత్తికి రికార్డు ధర
పత్తికి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డు ధర వచ్చింది. గత సీజన్ ప్రారంభంలో క్వింటా రూ.8,000 ఉండగా అది ఏప్రిల్ నాటికి రూ.13,000 దాటి పోయింది. పత్తిసాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతున్నా, ఆశించిన దిగుబడులు రావడం లేదు. పత్తిలో గులాబీ పురుగు ప్రధాన సమస్యగా తయారైంది. గులాబీ పురుగు ఎన్ని మందులు కొట్టినా లొంగడం లేదు. దీంతో పత్తి దిగుబడులు తగ్గిపోయాయి. ఎకరాకు సగటున 8 క్వింటాళ్ల పత్తి రావాల్సి ఉండగా గడచిన ఏడేళ్లుగా ఎకరాకు సగటున 3 క్వింటాళ్ల దిగుబడి కూడా రావడం లేదు. మార్కెట్లో పత్తి అవసరాలు తీరకపోవడంతో జిన్నింగ్ మిల్లులు చైనా నుంచి పత్తి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. రవాణా ఖర్చులతో కలిపి క్వింటా పత్తి దిగుమతి చేసుకుంటే రూ.15,000 అవుతుండటంతో మన మార్కెట్లోనూ పత్తి ధరలు గణనీయంగా పెరిగాయని పత్తి వ్యాపారులు చెబుతున్నారు.
*రైతు భరోసా కేంద్రాల్లో విత్తనాలు అమ్మాలి
రైతుకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచేందుకు రాష్ట్రంలో 11,000కు పైగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు. రైతులకు సేవలు అందించడమే ఈ కేంద్రాల లక్ష్యం. అయితే ఈ కేంద్రాల్లో ఎక్కడా పత్తి విత్తనాలు అమ్మిన దాఖలాలు కనిపించడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరచి ఆర్బీకేల్లో పత్తి విత్తనాలు అందుబాటులో ఉంచాలి. ప్రైవేటు కంపెనీలతో చర్చలు జరిపి బీటీ 2 పత్తి విత్తనాలు రైతులకు ఎమ్మార్పీ ధరలకు అందేలా చర్యలు తీసుకుంటే దోపిడీకి అడ్డుకట్ట పడుతుంది.