Bobbili: రైతులకు మద్దతుగా ఉద్యమించిన జనసేన నేతల అరెస్ట్

బొబ్బిలి చక్కెర కర్మాగారం బాధిత రైతులకు అండగా జనసేన నాయకులు రోడ్డెక్కారు. చెరుకు రైతుల ఒక్క రోజు బంద్ పిలుపుకు మద్దతు పలికారు. ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం ఫ్యాక్టరీ యాజమాన్యానికి కొమ్ముకాయడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రైతుల అక్రమ అరెస్టులకు నిరసనగా నినదించారు. చెరుకు రైతుల బంద్ పిలుపు నేపధ్యంలో వారికి మద్దతు తెలిపిన జనసేన నాయకులను పోలీసులు ముందస్తుగా ఆరెస్టులు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఈ అరెస్టులు కొనసాగాయి. పలువుర్ని గృహనిర్భంధం చేశారు. అరెస్టులు, నిర్భంధాల మధ్య పార్టీ ప్రధాన కార్యక్రమాల నిర్వహణ విభాగం రాష్ట్ర కార్యదర్శి శ్రీ బాబు పాలూరి ఆధ్వర్యంలో జనసేన శ్రేణులు అక్కడికి చేరుకున్నాక రైతులకు మద్దతుగా తరలివచ్చిన వారిని అరెస్ట్ చేయడంతో పాటు శ్రీ పాలూరి బాబు తండ్రి మీద చెయ్యి చేసుకున్నారు.
వారిని పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి పరామర్శించారు. పోలీసుల తీరు పట్ల మండిపడ్డారు. జనసైనికులపై చేయి చేసుకున్న పోలీసుల మీద కేసులు పెడతామని, రైతుల బకాయిలు పూర్తిగా తీరే వరకు పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. శ్రీ వెంకట నాయుడుపై చేయి చేసుకున్న బలిజపేట ఎస్ఐపై 24 గంటల్లో చర్యలు తీసుకోవాలని, సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.