కోనసీమలో జనసేన-వైసీపీ హోరాహోరీ.. జనసేన పార్టీకే అధిక్యం

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. మెజారిటీ స్థానాల్లో వైసీపీ అధిక్యం కొనసాగిస్తుండగా కొన్నిచోట్ల టీడీపీ తీవ్రపోటీ ఇస్తోంది. మరోవైపు జనసేన పార్టీ కూడా ఫలితాల్లో తన ప్రభావాన్ని చూపిస్తోంది. ఒక్క మున్సిపాలిటీలో మాత్రం వైసీపీకి జనసేన గట్టిపోటీ ఇస్తోంది. ఒక విధంగా వైసీపీ కంటే ముందంజలోనే ఉంది. తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రధాన కేంద్రమైన అమలాపురంలో జనసేన అభ్యర్థులు దూసుకెళ్తున్నారు. అమలాపురంలో 5 వార్డులను జనసేన కైవసం చేసుకుంది. అమలాపురం మున్సిపాలిటీలో మొత్తం 30 వార్డులు ఉండగా.. అందులో 6 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 24 వార్డులకే ఎన్నికలు నిర్వహించారు. పట్టణంలోని 3,4,6,7 వార్డుల్లో జనసేన అభ్యర్థులు విజయం సాధించారు. మరో వార్డు కూడా జనసేన ఖాతాలో చేరింది. అటు వైసీపీ నాలుగు స్థానాలు గెలుచుకోగా.. టీడీపీ రెండుచోట్ల విజయం సాధించింది.

ఐతే ఆరు స్థానాలను వైసీపీ ఏకగ్రీవం చేసుకోవడంతో ఆ పార్టీ స్కోర్ 10కి చేరింది. ఎన్నికల్లో గెలిచిన స్థానాల విషయంలో మాత్రం జనసేన లీడ్ లో ఉంది. ఇంకో 12 వార్డుల ఫలితాలు రావాల్సి ఉండటంతో టెన్షన్ నెలకొంది. ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్లలోనూ జనసేనకు ఆధిక్యం లభిచింది. గోదావరి జిల్లాల్లోని అన్ని మున్సిపాలిటీల్లో జనసేనకు మెరుగైన స్థానాలు వచ్చే అవకాశమున్నట్లు ఆ పార్టీ నేతలు చెప్తున్నారు.

ఇటు పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలోని 4వ వార్డులో జనసేన అభ్యర్థి విజయం సాధించారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగానూ జంగారెడ్డిగూడెం ప్రాంతంలో జనసేన ప్రభావం కనిపించింది. దీంతో మున్సిపల్ ఎన్నికల్లోనూ ఇదే హవాను కొనసాగిస్తామని జనసేన పార్టీ చెప్తోంది. ఇక్కడ గెలుపుపై జనసైనికులు ధీమాతో ఉన్నారు. అటు వైసీపీ కూడా మెరుగైన ఫలితాలు సాధిస్తోంది. స్థానిక ఎమ్మెల్యే ఎలీజా జంగారెడ్డిగూడెంను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అయినా గోదావరి జిల్లాల్లో జనసేన ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.

గోదావరి జిల్లాలో జనసేన దూసుకెళ్తుంటే.. విశాఖ జనసేనలో విషాదం నెలకొంది. గ్రేటర్ విశాఖపట్నం కార్పొరేషన్ లో 11వ వార్డు జనసేన అభ్యర్థిగా బరిలో దిగిన గోనె భారతి గుండెపోటుతో మృతి చెందారు. కౌంటింగ్ ప్రారంభానికి కొద్దిసేపటి ముందు ఆమె అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందారు.