జగన్ ప్రభుత్వాన్ని సాగనంపడం కోసమే టిడిపితో జనసేన పొత్తు

కడప: రాష్ట్ర అభివృద్ధి కాంక్షించి, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న జగన్ ప్రభుత్వాన్ని సాగనంపడం కోసమే టిడిపితో జనసేన పొత్తు పెట్టుకుందని ఉమ్మడి కడప జిల్లా కో ఆర్డినేటర్, కడప నియోజకవర్గ ఇన్చార్జి సుంకర శ్రీనివాస్ స్పష్టం చేశారు. 14 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేసి, 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయం అనుభవం గడించిన విపక్ష నేత చంద్రబాబు నాయుడును ఆధారాలు లేకుండా అరెస్టు చేయడం దారుణమన్నారు. కడప జిల్లా పర్యటనకు విచ్చేసిన జనసేన రాష్ట్ర కార్యదర్శి ఆమంచి స్వాములు ను శుక్రవారం కడప జనసేన పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు ఆమంచి స్వాములు, సుంకర శ్రీనివాస్ విలేకరులతో మాట్లాడుతూ ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమలో కూడా జనసేనకు ప్రజల్లో ఆదరణ ఉందన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని విమర్శించారు. వైకాపా నాయకులు దోచుకుని దాచుకుంటున్నారని ఆరోపించారు. సామాన్య ప్రజలకు ఎటువంటి మేలు జరగలేదని విమర్శించారు. విద్యుత్ చార్జీలు షాక్ కొడుతున్నాయని, ఇసుక రేటు అధికంగా పెరిగిందని దుయ్యబుటారు. తిండి, ఆరోగ్యం, విద్య సామాన్యులకు అందుబాటులో లేవన్నారు. రాష్ట్రంలో రోడ్లు అధ్వానంగా మారాయి. మౌలిక వసతులు లోపించాయని పేర్కొన్నారు. జనసేన అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజానీకానికి సుపరిపాలన అందిస్తామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో జనసేన రాష్ట్ర కార్యనిర్వాహణ కార్యదర్శి సురేష్ బాబు, కడప జిల్లా జనసేన సేవాదళ్ కో-ఆర్డినేటర్ పండ్రా రంజిత్ కుమార్, పత్తి విస్సు, బోరెడ్డి నాగేంద్ర, గజ్జల సాయి, ఉంగరాల విజయ్, శేషురాయల్, నాగరాజు, బాలునాయక్, కుమార్, సుధీర్, లోకేష్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.