యువతలో భరోసా నింపేలా జనసేన ‘యువశక్తి’

* జనవరి 12వ తేదీన శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో యువశక్తి కార్యక్రమం
* భవిష్యత్తులో యువత కోసం చేపట్టబోయే కార్యక్రమాలపై పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం
* ఉత్తరాంధ్ర పోరాట స్ఫూర్తికి, నైపుణ్యాలకి ప్రతీకలైన యువతకు వేదికపై సముచిత స్థానం
* విశాఖపట్నం మీడియా సమావేశంలో జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడి

యువతరానికి భవిష్యత్తు మీద భరోసా కల్పించేలా జనసేన పార్టీ ‘యువశక్తి’ కార్యక్రమం నిర్వహిస్తుందని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. స్వామి వివేకానంద జయంతి సందర్బంగా జనవరి 12వ తేదీన శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నామని తెలిపారు. ఉపాధి కోసం వలస పోతున్న ఉత్తరాంధ్ర యువతకు దిశానిర్దేశం చేసేలా… వారిలో ఉన్న శక్తి, నైపుణ్యాన్ని వెలికి తీసేలా యువశక్తి ఉంటుంది అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్య అతిధిగా హాజరై… యువత కోసం భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలు, వలసల నిరోధించడానికి తీసుకోనున్న చర్యలపై ప్రసంగిస్తారని వెల్లడించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కార్యక్రమం జరుగుతుందని, ఈ ప్రాంత అభివృద్ధి కోసం కష్టపడిన ప్రతి ఒక్కరిని ఈ వేదిక మీదకు తీసుకొస్తామని తెలిపారు. శుక్రవారం ఉదయం విశాఖపట్నం పబ్లిక్ లైబ్రరీలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “జనసేన పార్టీ యువతకు పెద్దపీట వేస్తుంది. నిజాయతీ, న్యాయం కోసం పోరాటం చేసే స్ఫూర్తి ఉత్తరాంధ్ర యువత సొంతం. ఇక్కడ యువతలో చాలా ఆవేదన ఉంది. ఉపాధి అవకాశాల కోసం తల్లిదండ్రులు, పుట్టిన గ్రామాలను వదిలి పక్క రాష్ట్రాలకు వలస వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పక్క రాష్ట్రాలకు వెళ్లి అక్కడి యువత అవకాశాలను దెబ్బ తీయడం తమకీ ఇష్టం లేదని, తమకు మా ప్రాంతాల్లోనే అవకాశాలు కల్పించాలని వేడుకుంటున్నారు. విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో విస్తృతంగా పర్యటించినప్పుడూ అనేక సమస్యలను గుర్తించాం. ముఖ్యంగా యువత అనుభవిస్తున్న వేదనను శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లినప్పుడు ఆయన ఒకటే చెప్పారు. ఉత్తరాంధ్ర యువతలో ఉన్న సామర్థ్యం, నైపుణ్యం వెలికితీసే విధంగా అద్భుతమైన కార్యక్రమం చేపట్టాలని ఆదేశించారు. ఇక్కడి యువతకు మంచి భవిత ఉండాలని ఆకాంక్షించారు. అందులో భాగంగానే జనవరి 12వ తేదీన “యువశక్తి” కార్యక్రమాన్ని జనసేన పార్టీ నిర్వహిస్తోంది. నిస్సహాయత, నిర్లిప్తిత నిండిన ఇక్కడ యువతలో భరోసా నింపే విధంగా కార్యక్రమం ఉంటుంది.
* షణ్ముఖ వ్యూహంలో చాలా స్పష్టంగా చెప్పాం
జనసేన పార్టీ అధికారంలోకి వస్తే చేపట్టబోయే కార్యక్రమాలపై షణ్ముఖ వ్యూహాంలో చాలా స్పష్టంగా చెప్పాం. ప్రతి ఏడాది లక్ష మంది యువతకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించి వారిని పారిశ్రామికవేత్తలుగా మారుస్తాం. చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఏర్పాటు చేసి పదిమందికి ఉపాధి కల్పించేలా వారికి ఆర్థిక చేయూత అందిస్తామని హామీ ఇచ్చాం. మత్స్యకారులకు సరైన ఉపాధి అవకాశాలు లేక ఈ ప్రాంతం నుంచి ప్రతి ఏడాది 15 వేల నుంచి 20 వేల మంది గుజరాత్, చెన్నై వంటి రాష్ట్రాలకు వలస పోతున్నారు. యువత ఉపాధి అవకాశాల కోసం వేలాది మంది పక్క రాష్ట్రాలకు వలస పోతున్నారు. ఈ వలసలు నిరోధించేలా జనసేన పార్టీ చర్యలు తీసుకుంటుంది” అన్నారు. ఈ సమావేశంలో పార్టీ పీఏసీ సభ్యులు కోన తాతారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు టి.శివశంకర్, పెదపూడి విజయ్ కుమార్, పార్టీ నేతలు పరుచూరి భాస్కరరావు, సందీప్ పంచకర్ల, పి.వి.ఎస్.ఎన్.రాజు, శ్రీమతి పసుపులేటి ఉషా కిరణ్, వంపూరు గంగులయ్య, కళ్యాణం శివ శ్రీనివాస్, గడసాల అప్పారావు, శ్రీమతి ఎ.దుర్గా ప్రశాంతి, డా.మూగి శ్రీనివాస్, పీతల మూర్తి యాదవ్, శ్రీమతి నాగలక్ష్మి, శ్రీమతి శరణి పాల్గొన్నారు.