కాపు ఉత్తమ విద్యార్థులకు ప్రతి ఏటా లక్ష రూపాయల స్కాలర్ షిప్

  • ఎపి కాపు టీచర్స్ వెల్పేర్ అసోసియేషన్ ప్రధమ వార్షికోత్సవ సభలో జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్

తిరుపతి: ఉత్తమ ప్రతిభ కనపరిచిన కాపు విద్యార్థులకు స్కాలర్ షిప్ కోసం ప్రతి ఏటా లక్ష రూపాయలు విరాళాన్ని ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ప్రకటించారు. ఆదివారం తిరుపతిలోని ఓ ప్రైవేటు హోటల్ లో జరిగిన ఎపి కాపు టీచర్స్ వెల్పేర్ అసోసియేషన్ ప్రధమ వార్షికోత్సవ సభలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. కాపులంతా ఐక్యంగా ఉంటూ చదువుకోలేని యువతీ యువకులకు ఆర్థికంగా అండగా నిలవాలన్నారు. ప్రతి ఒక్కరికీ వారి కులాన్ని ప్రేమించే హక్కు ఉందని, అలాగే ప్రతి కులాన్ని గౌరవించే బాధ్యత ఉందన్నారు. తమకంటే ఎదిగిన కులాలను ప్రేరణగా తీసుకొని అభివృద్ధి చెందాలన్నారు. తమకంటే కింది స్థాయిలో ఉన్న వారికి అండగా నిలబడి ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. విద్యాదానం చేయడమనేది చాలా అదృష్టమని అందుకే ప్రతి ఏటా కాపు విద్యార్థుల చదువుల కోసం లక్ష రూపాయల విరాళాన్ని ఇస్తానని ప్రకటించారు. అంతకు ముందు ఆయన మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, కాపు నేతలు ఆమంచి స్వాములు, మంగబాబు, దొరరాజు, ఫణీంద్రకుమార్, నారాయణరావులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ చిత్తూరు జిల్లా గౌరవ అధ్యక్షులు కృష్ణయ్య, జిల్లా కార్యదర్శి ఆనంద్, తిరుపతి నగర కార్యదర్శి రవి, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.