రైతులను ధనికులుగా మార్చడమే లక్ష్యo: కేసీఆర్‌

ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ బుధవారం వ్యవసాయ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో కేసీఆర్‌ మాట్లాడుతూ… తెలంగాణ రైతులు మార్పును అందిపుచ్చుకునే చైతన్యం కలిగిన వారు. వానాకాలంలో మక్కలు వేయడం లాభదాయకం కాదంటే.. ఎవ్వరూ వేయలేదు. ప్రభుత్వ ప్రయత్నాలు తమ కోసమే అని రైతులు గ్రహించారు. రైతులకు సరైన మార్గదర్శనం చేస్తే, వ్యవసాయాన్ని తప్పక లాభదాయకంగా మార్చవచ్చు.

తెలంగాణలో వ్యవసాయం లాభసాటికి అనుగుణంగా ప్రబుత్వం పనిచేస్తుందని, అన్నదాతలు ధనికులుగా మారాలని సీఎం కేసీఆర్‌ ఆకాంక్షించారు. లక్షలాది మంది రైతులు, కోటికి పైగా ఎకరాలతో విస్తారంగా ఉన్న వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చేందుకు వ్యవసాయ శాఖ రైతులకు సరైన మార్గదర్శనంచేస్తూ  మొండి పట్టుదలతో పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో రైతులను ధనికులుగా మార్చడమే లక్ష్యమని.. అందుకే ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోందని, ఎంతో ఖర్చు పెడుతోందని అన్నారు. ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించాలంటే వ్యవసాయ శాఖ మరింత క్రియాశీలం కావాలని, సంప్రదాయక వ్యవసాయ పద్ధతుల స్థానంలో ఆధునిక విధానాలు రావాలని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులను అధ్యయనం చేసి, వాటిని తెలంగాణలో అమలు చేయాలని కేసీఆర్‌ సూచించారు. వ్యవసాయ రంగంలో గొప్ప పరివర్తన రావాలన్నారు. అసంఘటిత రంగంలో ఉన్న రైతులకు సంఘటిత శక్తిలోని బలమెంతో చూపించేందుకు, మేలైన సాగు విధానాలు, లాభదాయక పద్ధతులు చెప్పేందుకు వ్యవసాయ శాఖ మార్గదర్శనం చేయాలని, నాయకత్వం వహించాలని కోరారు. తెలంగాణ గొప్ప వ్యవసాయ రాష్ట్రంగా మారుతోందని, దానికి తగ్గట్టు వ్యవసాయ శాఖ కూడా సంస్థాగతంగా బలోపేతం కావాలని సీఎం ఆకాంక్షించారు. అవసరమైతే మరిన్ని పోస్టులు మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.